బాలికల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2021-10-25T06:00:51+05:30 IST

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అమ్మాయిల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. వండి వడ్డించడానికి సరకులు లేకపోవడంతో అరకొరగా భోజనం పెడుతున్నారు.

బాలికల ఆకలి కేకలు

కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నిండుకున్న సరకులు

అటకెక్కిన మెనూ.. విద్యార్థినులకుఅరకొరగా భోజనాలు

సరకుల కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌

ఆగస్టు నుంచి అంతంతమాత్రంగానే సరఫరా

దసరా సెలవుల తరువాత పరిస్థితి మరింత దారుణం

పిల్లలను పాఠశాలకు పంపవద్దంటూ తల్లిదండ్రులకు ఫోన్లు

అరువుపై సరకులు తెచ్చి భోజనాలు పెడుతున్న నిర్వాహకులు

అన్నం... పప్పు... రసంతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి


విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అమ్మాయిల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.  వండి వడ్డించడానికి సరకులు లేకపోవడంతో అరకొరగా భోజనం పెడుతున్నారు. సరకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లకుపైగా బకాయిలు వుండడంతో ఆగస్టు నుంచి సరకుల సరఫరా తగ్గిపోయింది. దసరా సెలవుల తరువాత ఈనెల 18న పాఠశాలలు తెరిచినా... పిల్లలను పంపవద్దంటూ తల్లిదండ్రులకు ఫోన్‌లు చేశారు. కొన్నిచోట్ల పిల్లలు రావడంతో ఉన్న సరకులతో అన్నం, పప్పు, రసంతో సరిపెడుతున్నారు. మరికొన్నిచోట్ల నిర్వాహకులు అరువుపై సరకులు తెచ్చి, బాలికలకు భోజనం పెడుతున్నారు. ఆ పరిస్థితి కూడా లేని పాఠశాలల్లో బాలికలు ఇళ్లకు వెళ్లిపోయారు. 

విశాఖ జిల్లాలో 34 మండలాల్లో  కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ) వున్నాయి. ప్రతి పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 280 సీట్లు ఉన్నాయి. పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానంలో నిర్వహించే కేజీబీవీల్లో ఒక్కో బాలికకు ప్రతి నెలా భోజనాలు, ఇతరత్రా అవసరాల కోసం ప్రభుత్వం రూ.1400 చొప్పున వెచ్చిస్తున్నది. పౌరసరఫరాల శాఖ ద్వారా కిలో రూపాయి చొప్పున బియ్యం సరఫరా చేస్తుండగా.... పప్పుదినుసులు, పాలు, కూరగాయలు, గుడ్లు, మాంసాహారం, గ్యాస్‌ వంటివి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుంటారు. ఇంకా విద్యుత్తు, స్టేషనరీ, మరుగుదొడ్ల నిర్వహణ, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి కేజీబీవీకి ఏటా రూ.3 లక్షలు కేటాయిస్తారు. కాస్మోటిక్స్‌ ఖర్చుల కింద ఒక్కో బాలికకు నెలకు రూ.100 చొప్పున ఇవ్వాలి. 

కేంద్రం నిధులు ఇస్తున్నా...

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ మేరక ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కేజీబీవీలకు విడుదల చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా స్థాయిలో బిల్లులు మంజూరుచేసేవారు. సీఎఫ్‌ఎంఎస్‌ అమలు తరువాత మొత్తం నిధులు ప్రభుత్వ ఆఽధీనంలో ఉండడంతో ప్రతి రూపాయి అమరావతి నుంచి విడుదల కాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు చెప్పిన సమాచారం మేరకు గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు, మళ్లీ ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు వరకు బిల్లులు మంజూరు కాలేదు. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు బిల్లులు అప్‌లోడ్‌ చేశారు తప్ప నిధులు విడుదల  చేయలేదు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు వరకు బిల్లులు ఇంకా ఆన్‌లైన్‌లో నమోదుచేయలేదు. మొత్తం మీద గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు సరకుల సరఫరా కాంట్రాక్టర్లకు    రూ.6 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో వున్నట్టు సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులు చెబుతున్నారు.\


చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

గత ఏడాది నవంబరు నుంచి బిల్లులు మంజూరుకాకపోవడంతో సరకులు సరఫరాచేసే కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల్లో కొంతమొత్తమైనా క్లియర్‌ చేయాలని ఇవ్వకపోతే సరకులు సరఫరా చేయలేమని సమగ్ర శిక్షా అభియాన్‌ అఽధికారులకు స్పష్టంచేశారు. త్వరలో బిల్లులు వస్తాయని అధికారులు నచ్చజెప్పడంతో సరకులు సరఫరాను ఆపేయకుండా... బాగా తగ్గించేశారు. అధికారులు ఏమీ చేయలేక ఆ సరకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదు. అధికారులు హామీ ఇచ్చి నెల రోజులు దాటినా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో ఈ నెల ఆరంభం నుంచి కాంట్రాక్టర్లు సరకుల సరఫరాను పూర్తిగా ఆపేశారు. కాగా వంట గ్యాస్‌ సరఫరా బిల్లులు కూడా భారీగానే పేరుకుపోయాయి. అధికారుల సమాచారం మేరకు  ఒక్కొక్క కేజీబీవీ లక్ష రూపాయల వరకు బకాయి ఉంది. 


విద్యార్థిలను పంపొద్దని తల్లిదండ్రులకు ఫోన్లు

దసరా ముందు వరకు అరువుపై సరకులు తెచ్చి భోజనాలు పెట్టిన స్పెషలాఫీసర్లు మరింత అప్పులు చేయడానికి సాహసం చేయడంలేదు. దసరా సెలవుల తరువాత విద్యాలయాల నిర్వహణ కష్టమని భావించిన వీరు.. బాలికల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, మళ్లీ తాము కబురు చేసే వరకు పిల్లలను పాఠశాలకు పంపొద్దని కోరారు. అయితే కొన్నిచోట్ల దసరా సెలవుల తరువాత కొంతమంది బాలికలు పాఠశాలలకు వచ్చారు. రోలుగుంట కేజీబీవీకీ ఒక్కరు కూడా రాలేదు. రావికమతం విద్యాలయానికి వచ్చిన కొద్ది మంది విద్యార్థినులు రెండు రోజులు ఉండి తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. జిల్లాలోని కేజీబీవీల్లో 9,520 విద్యార్థినులు ఉండగా దసరా సెలవులు తరువాత 20-30శాతం మందే హాజరయ్యారు. కొన్నిచోట్ల పదో తరగతి విద్యార్థినులు మాత్రమే వచ్చారు. 


పాక్షికంగా బిల్లులు వచ్చాయి

- రాజేశ్వరి, జీసీడీవో, సమగ్ర శిక్షా అభియాన్‌

కేజీబీవీల్లో మెస్‌ బిల్లులతోపాటు ఇతరత్రా బిల్లులు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. దీంతో కాంట్రాక్టర్లు సరకుల సరఫరాను తగ్గించారు. ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. సరకులు తగ్గిపోవడంతో పూర్తిస్థాయిలో మెనూ అమలు కావడంలేదు. దసరా సెలవుల తరువాత విద్యార్థినులు పూర్తిస్థాయిలో పాఠశాలలకు రాలేదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొన్ని బిల్లులు మంజూరుకావడంతో సరకులు సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు సముఖత వ్యక్తం చేశారు.


Updated Date - 2021-10-25T06:00:51+05:30 IST