బాబోయ్‌...విమ్స్‌

ABN , First Publish Date - 2021-05-02T05:52:13+05:30 IST

విమ్స్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

బాబోయ్‌...విమ్స్‌

పరిమితికి మించి రోగులకు అడ్మిషన్‌

ఆక్సిజన్‌ బెడ్లు 300 మాత్రమే...

ప్రస్తుతం 450 మందికిపైగా బాఽధితులు

పైపులైన్‌ చివరనున్న వారికి అందని ఆక్సిజన్‌

పెరుగుతున్న మరణాలు

రోజూ 20కి పైనే?

బయటకు రాని లెక్కలు

పడకలు ఉన్నంత మేరకే బాధితులను చేర్చుకోవాలని వైద్యులు చెప్పినా వినని నోడల్‌ అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విమ్స్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ రోజూ పదుల సంఖ్యలో కొవిడ్‌ రోగులు మరణిస్తున్నారు. అయితే అందుకు కరోనా కారణం కాదని, ఇతర వ్యాధులతో చనిపోయారని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆక్సిజన్‌ అందకే చాలామంది మృత్యువాడ పడుతున్నారని విశ్వసనీయ సమాచారం. విమ్స్‌లో ఆక్సిజన్‌ బెడ్లు కేవలం 300 మంది మాత్రమే. కానీ అక్కడ గత కొద్దిరోజులుగా 450 మందికిపైగా ఆక్సిజన్‌ సేవలు అందిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరగడం, అధికారులపై బెడ్‌ కోసం ఒత్తిడి ఎక్కువ కావడంతో కాదనలేక నోడల్‌ అధికారుల సిఫారసులతో చేర్చుకుంటున్నారు. కొత్తగా చేరిన వారికి ఆక్సిజన్‌ వార్డుల్లో చివరి బెడ్లు కేటాయిస్తున్నారు.  

హైప్రెషర్‌ ఆక్సిజన్‌ అవసరం

కరోనా బాధితులకు సాధారణ రోగుల్లా కాకుండా ఆక్సిజన్‌ను హైప్రెషర్‌తో అందించాలి. ఆ రకమైన సౌకర్యం, అందుకు అవసరమైన స్థాయిలో ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం కూడా విమ్స్‌లో ఉంది. అయితే ఆ హైప్రెషర్‌ 300 పడకల వరకే వెళుతుంది. ఆ తరువాత అదనంగా వేసిన పడకలకు ఆక్సిజన్‌ ప్రెషర్‌ తగ్గిపోతోంది. తగినంత స్థాయిలో ఆక్సిజన్‌ అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు విలవిలా కొట్టుకుంటున్నా చేసేదేమీ లేకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థితి లేకుండా, అడ్మిషన్ల సంఖ్యను తగ్గించాలని అక్కడి వైద్యాధికారులు కోరుతున్నా...నోడల్‌ అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పేస్తున్నారు. ఉన్నత స్థాయిలో బెడ్లు కావాలని అడుగుతున్నారని, తప్పడం లేదని అంటున్నారు. దీనిపై ఓ ప్రొఫెసర్‌ జిల్లా అధికారులకు లేఖ కూడా రాశారు. శుక్రవారం సాయంత్రం వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకువెళ్లారు.

వైద్యుల సంఖ్య చాలా పరిమితం

వైద్య వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం విమ్స్‌లో ప్రస్తుతం రోజుకు 25 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా మూడు షిఫ్టుల్లో షిఫ్టునకు ఎనిమిది మంది వస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్నది 450 మంది. అంటే...ఒక్కో వైద్యుడు సుమారుగా 60 మంది రోగులను చూడాలి. అక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. స్టాఫ్‌ నర్సులు, ఇతర సేవలందించే సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు.

సమస్య వసతులు లేకపోవడమే

విమ్స్‌లో ఈ దారుణ పరిస్థితులకు కారణం...ఉన్న వసతులకు మించి రోగులను చేర్చుకోవడం ఒక కారణమైతే, తగిన సంఖ్యలో వైద్యులు, నర్సులు లేకపోవడం మరో కారణం. ఇక్కడ మరణాల సంఖ్య తగ్గాలంటే...బెడ్ల సంఖ్యకు మించి రోగులను అడ్మిట్‌ చేయడానికి ఉన్నతాధికారులకు అనుమతించకూడదని అక్కడి వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. ఎక్కువ మందిని పంపించి, చనిపోతున్నారని తమపై నిందలు వేయవద్దని కోరుతున్నారు.

గంటల తరబడి నిరీక్షణ

విమ్స్‌లో కొవిడ్‌ బాధితులను చేర్చుకోవడంలోనూ తాత్సారం జరుగుతోంది. కొత్తగా నియమితులైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆస్పత్రిలో చేరేందుకు వచ్చే వారి వివరాలను ఆన్‌లైన్‌లో సత్వరం పొందుపరచలేకపోతున్నారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్చుకోవాలంటే..ముందుగా అతని/ఆమె వివరాలను సీఎం డాష్‌బోర్డుకు అనుసంధానించాలి. అనంతరం కేసు షీట్‌ జనరేట్‌ అవుతుంది. అయితే, ఈ ప్రక్రియ ఇక్కడ మందకొడిగా సాగుతుండడంతో ఒక్కో అడ్మిషన్‌కు కనీసం గంట సమయం పడుతోంది. దీంతో మిగిలిన బాధితులు విమ్స్‌ ప్రాంగణంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.  


Updated Date - 2021-05-02T05:52:13+05:30 IST