అయ్యా..! మాకెందుకీ సర్పంచ్ పదవులు?
ABN , First Publish Date - 2021-11-28T06:17:52+05:30 IST
‘గ్రామాల్లో సర్పంచులకు ఎలాంటి విలువ లేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది.

పంచాయతీలో ఏ పనీ చేయలేకపోతున్నాం..
జనంలో చులకన అయిపోయాం
జడ్పీ సీఈవో ఎదుట రాయపురాజుపేట సర్పంచ్ వేదన
చోడవరం, నవంబర్ 27: ‘గ్రామాల్లో సర్పంచులకు ఎలాంటి విలువ లేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. ఇది తెలిసి...ఇక సర్పంచ్ ఏం చేయలేరంట! అని ప్రజలు మమ్మల్ని చులనకగా చూస్తున్నారు. అటువంటప్పుడు ఈ పదవులు మాకెందుకు?’ అని జిల్లా పరిషత్ సీఈవో ఎదుట ఓ సర్పంచ్ ఆవేదన వెలిబుచ్చారు. శనివారం సాయంత్రం చోడవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో స్వచ్ఛ సంకల్పంపై సర్పంచులతో జడ్పీ సీఈవో నాగార్జునసాగర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన రాయపురాజుపేట పంచాయతీ సర్పంచ్ బొడ్డేడ రామునాయుడు మాట్లాడుతూ...‘గ్రామంలో ఏ పనీ చేయలేకపోతున్నాం. పంచాయతీకి సరైన భవనం లేక ఇబ్బంది పడుతున్నాం. వలంటీర్లు ఎవరూ మాట వినడం లేదు. ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయలేని దుస్థితిలో పడిపోయాం. పంచాయతీలో ఏం జరుగుతుందో సర్పంచులుగా మాకే తెలియడం లేదు. జనంలో ఏమాత్రం గౌరవం లేని ఈ పదవులు మాకెందుకు. దయచేసి మా గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడండి’ అంటూ సీఈవోను వేడుకున్నారు. పంచాయతీ సర్పంచుల పరిస్థితి, నిధుల సమస్య గురించి ఏకరువు పెట్టడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. సర్పంచ్ ప్రశ్నలపై జడ్పీ సీఈవో స్పందిస్తూ, పంచాయతీ నిధులు ఎక్కడికీ పోవని, సర్దుబాటు చర్యల్లో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. పంచాయతీ కార్యకలాపాలపై స్థానిక పంచాయతీ కార్యదర్శి నుంచి వివరాలు తీసుకోవచ్చునని, ఇతర సమస్యలు వుంటే రాష్ట్ర స్థాయిలో సర్పంచుల ఫోరం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవచ్చునని సమాధానమిచ్చారు.