ఏయూలో గో హత్య!
ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గో హత్య జరిగింది. ఏయూ భద్రతాధికారి ఖాన్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు మేతకు వచ్చిన ఆవును బంధించి తీవ్రంగా కొట్టడంతో అది మృతిచెందింది.

భద్రతాధికారి కొట్టడం వల్లనే మృతిచెందిందని జనసేన ఆరోపణ
చర్యలకు డిమాండ్
మూడో పట్టణపోలీసులకు ఫిర్యాదు
గోవును పూడ్చినప్రదేశంలో జనసైనికుల నిరసన
మద్దిలపాలెం, జూలై 24: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గో హత్య జరిగింది. ఏయూ భద్రతాధికారి ఖాన్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు మేతకు వచ్చిన ఆవును బంధించి తీవ్రంగా కొట్టడంతో అది మృతిచెందింది. అనంతరం దానిని ఇంజనీరింగ్ రోడ్డు మైదానంలో పూడ్చివేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి రావడంతో గోవును పూడ్చిన స్థలంలో జనసేన నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్, జనసేన ఫ్లోర్‌లీడర్ పీతల మూర్తియాదవ్ మాట్లాడుతూ ఏయూలో మేతకు వచ్చిన పశువులను ఇక్కడి సెక్యూరిటీ గార్డులు బంధిస్తున్నారని, అయితే రిజిస్ట్రార్ పేరున రూ.వెయ్యి డీడీ తీసి అందిస్తే రైతులకు అప్పగిస్తున్నారన్నారు. కాగా ఐదారు రోజుల క్రితం లొడగల వెంకటరావుకు చెందిన ఆవు ఏయూలో మేతకు వెళ్లిందని, దానిని సెక్యూరిటీ గార్డులు బంధించడంతో ఆయన రూ.వెయ్యి డీడీ తీశారన్నారు. అయినా సరే...భద్రతాధికారి ఖాన్ పట్టించుకోకుండా ఆవును విడిచి పెట్టేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారని, అంతమొత్తం ఇచ్చుకోలేనని వెంకటరావు వెళ్లిపోయాడన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ఖాన్ ఆవును చితకబాదడంతో అది మృతిచెందిందన్నారు. ఆ విషయం తెలిసిన రైతు ఆవు కళేబరాన్ని అప్పగించాలని కోరినా నిరాకరించిన ఖాన్ దానిని మైదానంలో పాతిపెట్టాడన్నారు. పవిత్రమైన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో హిందువుల మనోభావాలను హత్య చేశారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న విశ్వవిద్యాలయంలోని భద్రతాధికారి ఖాన్ ఆవును హత్య చేయడం క్షమించరాని నేరమన్నారు. అతడిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఖాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని, గోవు యజమానికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో రిటైరైన ఖాన్‌ను దొడ్డిదారిన ఏయూలో భద్రతాధికారిగా నియమించారని, వైసీపీ మద్దతుతో ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నేతలు విజయశంకర్, ఫణీంద్ర పాల్గొన్నారు.