ఎస్‌బీఐలో చోరీ యత్నం

ABN , First Publish Date - 2021-07-08T06:10:21+05:30 IST

రాంబిల్లి, జూలై 7: మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌ శాఖలో మంగళవారం రాత్రి చోరీ యత్నం జరిగింది.

ఎస్‌బీఐలో చోరీ యత్నం
గొడుగు అడ్డం పెట్టుకుని చోరీకి ప్రయత్నిస్తున్న దొంగ

రాత్రి 10:30 గంటల సమయంలో చొరబడిన దొంగ

డబ్బు, నగలు భద్రం

పరిశీలించిన పోలీసులు, డ్యాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌


రాంబిల్లి, జూలై 7: మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌ శాఖలో మంగళవారం రాత్రి చోరీ యత్నం జరిగింది. ఈ విషయాన్ని ఉద్యోగులు బుధవారం ఉదయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలమంచిలి సీఐ ఎస్‌వీ.వెంకటరమణ అందించిన వివరాల మేరకు... మంగళవారం సాయంత్రం బ్యాంక్‌ సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఓ దొంగ  తన ముఖం కనిపించకుండా ముసుగు, చేతులకు గ్లౌజులను ధరించి గొడుగుతో బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. బ్యాంక్‌ ప్రవేశ ద్వారం తాళం తీసి నేరుగా లోపలికి ప్రవేశించాడు. ఫుటేజీలో రికార్డు కాకుండా ఉండేందుకు వీలుగా బ్యాంక్‌లోని పలుచోట్ల సీసీ కెమెరాలను పైకి తిప్పేశాడు. ముందుగా బ్యాంక్‌ మేనేజర్‌ గది, నగదు కౌంటర్‌, ఆభరణాలు భద్రపరచు గది (స్ట్రాంగ్‌రూమ్‌)లో చోరీకి ప్రయత్నించారు. నగదు, ఆభరణాల లాంటివేవీ దొరకకపోవడంతో తిరుగుముఖం పట్టాడు. బుధవారం బ్యాంక్‌కు వెళ్లిన సిబ్బంది ప్రధాన ప్రవేశద్వారం తలుపులు తీసి ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. సీఐతో పాటు రాంబిల్లి, ఎలమంచిలి టౌన్‌ ఎస్‌ఐలు అరుణ్‌కిరణ్‌, నరసింగరావు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌ బృందాలు ఆధారాలను సేకరించాయి. బ్యాంక్‌ మేనేజర్‌ కె.శ్రీధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ తెలిపారు. కాగా, స్టేట్‌బ్యాంక్‌లో చోరీ యత్నం జరిగిందని విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు గురై  అక్కడికి చేరుకున్నారు. నగదు, ఆభరణాలు చోరీకి గురికాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-07-08T06:10:21+05:30 IST