దారుణం

ABN , First Publish Date - 2021-08-21T05:52:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా స్వయం ఉపాధి రుణాల మంజూరును నిలిపివేసింది.

దారుణం

‘స్వయం ఉపాధి’కి గండి

రెండేళ్లుగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందని రుణాలు

కోట్లాది రూపాయలు అందించిన గత ప్రభుత్వాలు

ఆ ఊసే ఎత్తని వైసీపీ సర్కారు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా స్వయం ఉపాధి రుణాల మంజూరును నిలిపివేసింది. ఏటా వందల మందికి లక్షలాది రూపాయలు రుణంగా అందించిన బీసీ కార్పొరేషన్‌ ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయింది. ఒకప్పుడు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలపైగా రుణాలను 30 నుంచి 60 శాతం (రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు) సబ్సిడీపై అందించేవారు. రుణాలను పొందినవారు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు మరో పది మందికి ఉపాధి కల్పించేవారు. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు బీసీ కార్పొరేషన్‌తోపాటు మిగిలిన కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు స్వస్తి పలికింది. 


నీరుగారుతున్న లక్ష్యం

బీసీ కార్పొరేషన్లను, ఎస్సీ కార్పొరేషన్‌లను గొప్ప లక్ష్యంతో ఏర్పాటుచేశారు. ఇవి ఆయా వర్గాల్లోని నిరుపేదలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించేవి. బీసీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలో 2016-17 ఏడాది 4,961 మందికి రూ.33.33 కోట్లు సబ్సిడీ కింద, 36.34 కోట్లు రుణంగా అందజేసింది. అలాగే 2017-18 ఏడాది 8,633 మంది లబ్ధిదారులకు రూ.67.51 కోట్లు సబ్సిడీగా, మరో రూ.74.01 కోట్లు రుణంగా, 2018-19 ఏడాదిలో 1,723 మంది లబ్ధిదారులకు రూ.15.28 కోట్లు సబ్సిడీ కింద, మరో రూ.16 కోట్లు రూపాయలు రుణంగా  అందించారు. వీరంతా ఆయా మొత్తాలతో స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా గత ప్రభుత్వం కార్పొరేషన్ల సహాయంతో నిధులు అందించింది. లబ్ధిదారుల్లో పలువురు డెయిరీలు, కోళ్ల ఫారాలు వంటివి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఫెడరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలతో గ్రూపుగా వ్యాపారాలను, చేతివృత్తులను ప్రారంభించి ఆర్థికంగా ఎంతోమంది వృద్ధి చెందారు. గతంలో ఏటా వేలాది మందికి కార్పొరేషన్‌ రుణాలు అందించి స్వయం వృద్ధికి దోహదపడిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంపై ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగనన్న చేయూత, చేదోడు పేరుతో ప్రభుత్వం అకౌంట్లలో నగదు జమ చేయడం వల్ల ఉపయోగమేమీ ఉండడం లేదని, ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడేస్తున్నారే తప్ప ఉపాధి పొందేందుకు వినియోగించలేకపోతున్నారని పలువురు వాపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందించే చిన్నపాటి ఆర్థిక సాయంతో వ్యాపారాలు చేసేందుకు అవకాశముండడం లేదని, వాటిని ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించుకోవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం డబ్బులు పంపిణీకి బదులుగా..ఉపాధి పొందేందుకు రుణాలను అందించాలని కోరుతున్నారు. 


రుణాలు అందిస్తే ఉపాధికి అవకాశం.. 

- అప్పారావు, రజక అసోసియేషన్‌ నాయకుడు

గతంలో రజకులకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు, చేతి వృత్తి పరికరాలను అందించేవారు. దీనివల్ల మాలాంటి వాళ్లు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండేది. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం రుణాలను పూర్తిగా నిలిపివేసింది. సాయం కింద కొందరికే ప్రభుత్వం డబ్బులు వేస్తోంది. గతంలో మాదిరిగా సబ్సిడీతో కూడిన రుణాలు అందించే బాగుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. 

Updated Date - 2021-08-21T05:52:04+05:30 IST