పేరుకే 24/7

ABN , First Publish Date - 2021-12-09T06:16:56+05:30 IST

గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన 24 గంటల ఆస్పత్రులు లక్ష్యానికి సుదూరంలో ఉన్నాయి.

పేరుకే 24/7
జీకేవీధి పీహెచ్‌సీలో రాత్రి 8.30 గంటలకు విధుల్లోనున్న స్టాఫ్‌నర్సు వరలక్ష్మి, ఎంఎన్‌వో గోవిందరావు

ఆస్పత్రుల్లో పడకేసిన సేవలు

సాయంత్రం 4 దాటితే కనిపించని వైద్యులు

నిబంధనల  ప్రకారమైతే ఆ తరువాత కూడా

డాక్టర్లు ఫోన్‌కు అందుబాటు (కాల్‌ డ్యూటీ)లో ఉండాలి

 అవసరమైతే ఆస్పత్రికి రావాలి

కానీ సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలతో ఆ విధులకు మంగళం

అత్యవసర కేసులు వస్తే..అంతే సంగతులు

అనేకచోట్ల ఇదే పరిస్థితి...జిల్లాలో 24 గంటల ఆస్పత్రులు 83


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన 24 గంటల ఆస్పత్రులు లక్ష్యానికి సుదూరంలో ఉన్నాయి. 24 గంటలు మాట దేవుడెరుగు... కొన్నిచోట్ల కనీసం ఎనిమిది గంటలు

కూడా సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ పరిధిలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు 19, వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు...మొత్తం 83 ఆస్పత్రుల్లో 24 గంటలూ సేవలు అందించాలి. అయితే, వీటిలో సగానికిపైగా పేరుకే 24 గంటల ఆస్పత్రులు. సాయంత్రం ఐదు గంటలు (కొన్నిచోట్ల నాలుగు గంటలు) దాటితే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఆ తరువాత ఎవరైనా అత్యవసరమై ఆస్పత్రికి వెళ్లినా...పట్టించుకునే నాధుడు ఉండడు. నిబంధనల ప్రకారం వైద్యులు స్థానికంగా నివాసం ఉండడంతో పాటు రాత్రి వేళ ఫోన్‌కు అందుబాటు (కాల్‌ డ్యూటీ)లో ఉండాలి. కానీ, చాలామంది వైద్యులు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రాత్రివేళ నర్సింగ్‌ సిబ్బందే చూసుకుంటున్నారు. చిన్నపాటి సమస్యలతో వెళ్లే వారికి సేవలు అందిస్తున్న వీరు...పాముకాటో, గుండెపోటో అయితే... పట్టణా నికి తీసుకువెళ్లాలంటూ సలహా ఇస్తున్నారు. ఇలాగే రెండు రోజుల క్రితం (సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు) సీఆర్‌పీఎఫ్‌ ఏఎ్‌సఐ సవరప్పకు గుండెపోటు రావడంతో సహోద్యోగులు గూడెంకొత్త వీధి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. స్టాఫ్‌ నర్సే వైద్యం చేసే ప్రయత్నం చేశారు. కాల్‌ డ్యూటీలో వున్న వైద్యుడితో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలో ఆరు గంటలకు ఏఎ్‌సఐ సవరప్ప తుదిశ్వాస విడిచారు. అక్కడ వైద్యుడు స్థానికంగా నివాసం ఉండి ఉంటే...ప్రాణం దక్కేదని సహచరులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందురోజు రాత్రి అదే ఆస్పత్రికి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఓ మహిళ వెళ్లింది. స్టాఫ్‌ నర్సు మందులిచ్చి పంపించారు. ఆ మందుతో ఉపశమనం లభించకపోగా...పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చింతపల్లి సీహెచ్‌సీకి తరలించారు.  


వారిపైనే రాత్రి విధులు భారం

24 గంటలు సేవలు అందించే ఆస్పత్రుల్లో విధుల నిర్వహణకు ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులను (ఏరియా, జిల్లా, మరికొన్ని ఆసత్రుల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది) నియమించారు. ఉదయం షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యే వైద్యులు సాయంత్రం వెళ్లిపోతారు. అయితే, సాయంత్రం నుంచి మరుసటిరోజు ఉదయం వరకు అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రోగులు వస్తే...వైద్య సేవలు అందించేందుకు రావాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. అదే, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో అయితే షిఫ్టుల వారీగా వైద్యులు విధులు నిర్వర్తించాలి. నైట్‌ డ్యూటీకి వచ్చే వైద్యుడు మరుసటిరోజు ఉదయం వైద్యుడు వచ్చేంత వరకు ఆస్పత్రిలో సేవలు అందించాలి. అయితే, గ్రామీణ జిల్లాలోని అనేకచోట్ల పీహెచ్‌సీ వైద్యులు కాల్‌ డ్యూటీలో వుండడం లేదు. పీహెచ్‌సీలు వుండే గ్రామాలకు దూరంగా నివాసం ఉండడంతో...రాత్రివేళ అత్యవసరమైనప్పటికీ నర్సింగ్‌ సిబ్బందే దిక్కవుతున్నారు.


సుదూర ప్రాంతాల్లో నివాసం

ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించే సిబ్బంది తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాలి. అప్పుడే అత్యవసరమైతే ఆస్పత్రికి వచ్చేందుకు అవకాశముంటుంది. అయితే, జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో గల ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఎంతోమంది వైద్యులు చాలాదూరంగా ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రికి ఎప్పుడు వచ్చినా...చాలామంది సాయంత్రం నాలుగు గంటలు కాకముందే వెళ్లిపోతుంటారు. వైద్యులు స్థానికంగా నివాసం  వుండాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలున్నప్పటికీ ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. 

మారని గూడెంకొత్తవీధి పీహెచ్‌సీ తీరు


రాత్రివేళ స్టాఫ్‌నర్సు ఒక్కరే రోగులకు దిక్కు

స్థానికంగా నివాసం ఉండని వైద్యులు

గూడెంకొత్తవీధి, డిసెంబరు 8: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రాత్రి 8.30 గంటలకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సందర్శించగా స్టాఫ్‌నర్సు పాంగి వరలక్ష్మి, ఎంఎన్‌వో (నాలుగో తరగతి ఉద్యోగి) కొర్ర గోవిందరావు విధుల్లో ఉన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఇద్దరూ స్థానికంగా నివాసం వుండడం లేదు. ఇక్కడ క్వార్టర్లు లేకపోవడంతో సుమారు 25 కి.మీ. దూరంలో వున్న చింతపల్లిలో నివాసం వుంటూ రోజూ జీకే వీధికి రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత అత్యవసర కేసులు వస్తే వైద్యులు హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో చింతపల్లి సీహెచ్‌సీకి వెళ్లాల్సిందిగా వైద్య సిబ్బంది చెబుతుంటారు. 


అనంతగిరిలోనూ అదే పరిస్థితి

అనంతగిరి, డిసెంబరు 7: స్థానిక పీహెచ్‌సీని మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా స్టాఫ్‌నర్స్‌ నాగమణి, కంటింజెంట్‌ వర్కర్‌ రాధిక విధుల్లో ఉన్నారు. ఈ ఆస్పత్రిలో గతంలో ఇద్దరు వైద్యులు వుండేవారు. ఒకరిని ముంచంగిపుట్టుకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. మరొకరు స్థానికంగా నివాసం వుండడం లేదు. సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న విజయనగరంలో ఉంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో ఉండాలి. కానీ ఉదయం 10 గంటల తరువాత వచ్చి, సాయంత్రం 3.30 గంటలకు తిరిగి వెళ్లిపోతుంటారని స్థానికులు చెబుతున్నారు.


కాల్‌ డ్యూటీ తప్పనిసరి

- డాక్టర్‌ తిరుపతిరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో అనేక పీహెచ్‌సీలను 24 గంటల ఆస్పత్రులుగా మార్చాం. అక్కడ వైద్యులు రాత్రి వేళల్లో కాల్‌ డ్యూటీలో ఉండాలి. అత్యవసరమై ఎవరైనా ఫోన్‌ చేస్తే స్పందించడంతోపాటు అవసరమైతే ఆస్పత్రికి రావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించిన వారి పట్ల క్రమశిక్షణ చర్యలు తప్పవు. గూడెం కొత్తవీధిలో జరిగిన ఘటన నా దృష్టికి రాలేదు. చాలాచోట్ల వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులతో మాట్లాడి అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2021-12-09T06:16:56+05:30 IST