ఎయిడెడ్‌ పాఠశాలలకూ ఎసరు!

ABN , First Publish Date - 2021-08-25T05:51:01+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఎయిడెడ్‌ పాఠశాలలకూ ఎసరు!
నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో 1893లో ప్రారంభమైన సెయింట్‌ ఆంథోని పాఠశాల

ఆస్తులతో పాటు విద్యా సంస్థలను అప్పగించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు

మిగులు ఆస్తులు ప్రజావసరాలకు వినియోగించుకుంటామని స్పష్టీకరణ

...అందుకు ముందుకురాకుంటే భవిష్యత్తులో ఎటువంటి సాయం అందదని హెచ్చరిక

దాతలు ఇచ్చిన ఆస్తులు ఇతర అవసరాలకు వినియోగించరాదని మెలిక

సర్కారు ఆదేశాలపై యాజమాన్యాల ఆందోళన

ఆస్తుల అప్పగింతకు విముఖం

నేడే రేపో భేటీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఎయిడెడ్‌ పాఠశాలలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆస్తులు, భవనాలతో కలిపి  పాఠశాలలను తమకు అప్పగించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ అందుకు యాజమాన్యాలు సిద్ధంగా లేకుంటే...ఆయా పాఠశాలలకు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందబోదని, అలాగే ఎయిడెడ్‌ ఆస్తులు, భవనాలను ఇతర అవసరాలకు వినియోగించరాదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య బాగా తక్కువున్న ఒకటి, రెండు పాఠశాలల యాజమాన్యాలు మినహా జిల్లాలో మెజారిటీ ఎయిడెడ్‌ విద్యా సంస్థలు...ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ఎయిడెడ్‌ టీచర్లు, సిబ్బందిని మాత్రం విద్యా శాఖకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నాయి. 


ఆస్తులు స్వాధీనానికి మరోసారి ఉత్తర్వులు జారీచేయడంతో ఎయిడెడ్‌ పాఠశాలలు, ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. ఆస్తులతోపాటు సిబ్బందిని అప్పగించే యాజమాన్యాలు, కేవలం సిబ్బందిని మాత్రమే అప్పగించే యాజమాన్యాల నుంచి వేర్వేరుగా లేఖలు తీసుకోవాలని విద్యా శాఖను తాజాగా ఆదేశించింది.ఆస్తులతోపాటు పాఠశాలలను అప్పగించేందుకు ముందుకొచ్చిన విద్యా సంస్థలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించదు. యాజమాన్యాలు స్థిర,చర ఆస్తులను అప్పగించిన తరువాత అవి ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించబడతాయి. స్వాధీన ప్రక్రియ పూర్తయ్యాక విద్యా సంస్థల్లోని మిగులు ఆస్తులను ప్రజావసరాలకు వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆస్తులు అప్పగించేందుకు ఆమోదం తెలిపిన పాఠశాలల్లో సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. వారిని అవుట్‌ సోర్సింగ్‌ కింద తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా అన్‌ ఎయిడెడ్‌గా కొనసాగడానికి నిర్ణయించుకున్న పాఠశాలలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఇచ్చే వివిధ రకాల గ్రాంట్లు, ఆస్తులను ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి అవసరాలకు వినియోగించరాదని ఆదేశించింది. అలాగే పాఠశాలల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం ఉచితంగా, రాయితీపై కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించరాదని, వివిధ సంస్థలు, దాతలు ఇచ్చే భూముల విషయంలో ఇవే నిబంధనలు వర్తిస్తాయని తేల్చిచెప్పింది. 


నోటీసులకు విద్యాశాఖ సన్నద్ధం..


ఎయిడెడ్‌ యాజమాన్యాల కింద జిల్లాలో ప్రస్తుతం 40 ప్రాథమిక, తొమ్మిది ప్రాథమికోన్నత, 24 ఉన్నత పాఠశాలలు...మొత్తం 73 వరకూ ఉన్నాయి. వీటిలో 13,031 మంది విద్యార్థులు (5,624 మంది బాలురు, 7,397 మంది బాలికలు) ఉన్నారు. ఇక 73 పాఠశాలల్లో ప్రభుత్వం మంజూరుచేసిన 363 ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం వంద మంది కంటే తక్కువ ఉన్నారు. 260 వరకు ఖాళీలు ఉన్నాయి. రెండు దశాబ్దాల నుంచి నియామకాలు లేవు. మరోపక్క వందలాది మంది పదవీ విరమణ చేశారు. ఒకపక్క టీచర్లు లేక సతమతమవుతున్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మరింత ఇబ్బంది పెట్టేవిగా వున్నాయని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. దాతలు ఇచ్చిన ఆస్తులను  అప్పగించాలన్న నిబంధనపై మండిపడుతున్నారు. అయితే జిల్లాలో  ఎక్కువ యాజమాన్యాలు ఆస్తులు అప్పగించడానికి విముఖత చూపుతున్నాయని ఎయిడెడ్‌ టీచర్‌ ఒకరు తెలిపారు. విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా గల రెండు, మూడు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించాలని నిర్ణయించాయన్నారు. కాగా ఆస్తులు, టీచర్ల అప్పగింతపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిడెడ్‌ యాజమాన్యాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. 


నేడో రేపో యాజమాన్యాల భేటీ

ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు ఒకటి, రెండు రోజుల్లో సమావేశం కానున్నాయని తెలిసింది. జిల్లాలో ఆర్‌సీఎంలోని రెండు విభాగాల పరిధిలో ఎక్కువగా పయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో ఈ సంస్థల పాఠశాలల ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుంది. టీచర్లను వెనక్కి ఇచ్చేసి సొంతంగా పాఠశాలలు నిర్వహించాలని ఆర్‌సీఎం యాజమాన్యంలోని రెండు విభాగాలు నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే విషయం మిగిలిన యాజమాన్యాలకు చెప్పాలని యోచిస్తున్నట్టు తెలిసింది. 


పేద విద్యార్థులకు శాపం

ఎయిడెడ్‌ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరిని పలువురు విద్యావేత్తలు తప్పుబడుతున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే విద్యావ్యాప్తి కోసం అనేక మత సంస్థలు, దాతలు ముందుకువచ్చి ఏర్పాటుచేసిన పాఠశాలలు మరింత సమర్థంగా పనిచేసేలా ప్రోత్సాహించాలి తప్ప చంపే ప్రయత్నం మంచిది కాదని ఎయిడెడ్‌ స్కూలు టీచర్‌ ఒకరు పేర్కొన్నారు. అతి తక్కువగా పిల్లలుండే పాఠశాలలు మూసివేయడంలో తప్పులేదని, పేద విద్యార్థులకు ఉచితంగా/నామమాత్ర ఫీజు తీసుకుని చదువు చెప్పే ఎయిడెడ్‌ సంస్థలపై ఉక్కుపాదం మోపడం మంచిది కాదని అన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టాలంటే...కుటుంబ నియంత్రణ విధానం అవలంబించాలి...కానీ బతికున్న వ్యక్తులను చంపుకోకూడదని ఆయన ఒకింత ఆవేశంగా వ్యాఖ్యానించారు.Updated Date - 2021-08-25T05:51:01+05:30 IST