నేడే పవన్‌కల్యాణ్‌ రాక

ABN , First Publish Date - 2021-10-31T06:19:35+05:30 IST

స్టీల్‌ప్లాంటు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలపడానికి ఆదివారం విశాఖపట్నం వస్తున్న పవన్‌కల్యాణ్‌ కార్యక్రమానికి పోలీసు అధికారులు అడుగడుగునా అడ్డం పడుతున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

నేడే పవన్‌కల్యాణ్‌ రాక

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలపనున్న జనసేన అధినేత

కూర్మన్నపాలెంలో బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్న నేతలు

పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపణ


విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలపడానికి ఆదివారం విశాఖపట్నం వస్తున్న పవన్‌కల్యాణ్‌ కార్యక్రమానికి పోలీసు అధికారులు అడుగడుగునా అడ్డం పడుతున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తొలుత బహిరంగ సభ నిర్వహణకు వేదికను జాతీయ రహదారికి దూరంగా ఏర్పాటుచేయాలని ఒత్తిడి పెట్టారని, పెద్దస్థాయిలో చర్చలు జరగడంతో పార్టీ కోరిన ప్రాంతంలో అనుమతి ఇచ్చారని, అయితే దానికి కూడా ఇపుడు ఆంక్షలు పెడుతున్నారని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేదిక ఏర్పాటు పనులు ముందుకు జరగకుండా చూడడమే వారి ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. తాము జాతీయ రహదారికి అభిముఖంగా వేదిక వుండేలా ఏర్పాట్లు చేస్తుంటే, పోలీసులు వచ్చి...వేదికను ప్లాంటు వైపునకు మార్చాలని ఆదేశించారంటున్నారు. ఆ విధంగా చేస్తే...జాతీయ రహదారి, శిబిరం వైపు నుంచి వచ్చేవారికి వేదికపై వున్నవారు కనిపించరని పార్టీ నాయకులు చెబుతున్నారు. రోడ్డుపై దూరం నుంచైనా పవన్‌కల్యాణ్‌ను చూసే అవకాశం కల్పించాలని తాము భావిస్తుంటే...దానివల్ల ట్రాఫిక్‌ సమస్యలు వస్తాయని పోలీసులు అంటున్నారన్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపలకు వెళ్లి వేదిక పెట్టాలని శుక్రవారం చెప్పారని, మళ్లీ శనివారం రాత్రి వచ్చి...700 మీటర్లు వెనక్కి వెళితేనే అనుమతిస్తామని అన్నారని, ఇక తప్పనిసరి స్థితిలో ఆ విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ ప్రతినిధి కోన తాతారావు తెలిపారు. 

రెండు రోజులు నగరంలోనే?

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖపట్నం వస్తారు. విమానాశ్రయం నుంచి నేరుగా మారియట్‌ హోటల్‌కు వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. రెండు గంటలకు కూర్మన్నపాలెం చేరుకుని  రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న ఉక్కు ఉద్యోగులు, కార్మికులకు మద్దతు తెలుపుతారు. అనంతరం మూడు గంటలకు స్టీల్‌ప్లాంటు మార్గంలో ఏర్పాటుచేసిన సభా స్థలికి చేరుకుంటారు. కాగా పవన్‌కల్యాణ్‌ నవంబరు 1, 2 తేదీల్లో నగరంలోనే వుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్రాలో పార్టీ బలోపేతం, ఇక్కడి సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చర్చిస్తారని చెబుతున్నారు.

Updated Date - 2021-10-31T06:19:35+05:30 IST