23న సీఎం జగన్‌ రాక?

ABN , First Publish Date - 2021-10-19T06:10:24+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న నగరానికి రానున్నట్టు తెలిసింది.

23న సీఎం జగన్‌ రాక?

ఆయన చేతులమీదుగా ప్రాజెక్టులను ప్రారంభింపజేసేందుకు జీవీఎంసీ అధికారుల కసరత్తు


విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న నగరానికి రానున్నట్టు తెలిసింది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఆయన హాజరవుతారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అదేరోజు నగరంలో సీఎం చేతులమీదుగా కొన్ని ప్రాజెక్టులను ప్రారంభింపజేయాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. రూ.280 కోట్లతో కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో చేపట్టిన చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ (18 మెగావాట్ల సామర్థ్యం) ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.30 కోట్లతో ప్రారంభించిన వుడా పార్కు ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా జగదాంబ కూడలిలో రూ.11 కోట్లతో చేపట్టిన మల్టీలెవెల్‌ కార్‌పార్కింగ్‌ ప్రాజెక్టు కూడా పూర్తయ్యింది. ఇంకా వారసత్వ భవనాల పరిరక్షణలో భాగంగా రూ.పది కోట్లతో వన్‌టౌన్‌లోని టౌన్‌హాల్‌, పాత మునిసిపల్‌ కార్యాలయం ఆధునికీకరణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రూ.నాలుగు కోట్లతో ఎంవీడీఎం పాఠశాలను ఆధునికీకరించారు. పైన పేర్కొన్న ప్రాజెక్టులను సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించాలని జీవీఎంసీ అధికారులు యోచిస్తున్నారు. దీనిపై కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సోమవారం ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ ప్రాజెక్టులు కాకుండా ఇంకా ఏవైనా పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా వున్నట్టయితే గుర్తించి జాబితా రూపొందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. జాబితా తయారుచేసిన తర్వాత సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కమిషనర్‌ భావిస్తున్నారు.

Updated Date - 2021-10-19T06:10:24+05:30 IST