విద్యాభివృద్ధికి 30 శాతం సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపు
ABN , First Publish Date - 2021-10-30T04:14:51+05:30 IST
సింహాద్రి నిర్వాసిత గ్రామాల్లో విద్యాభివృద్ధికి సీఎస్‌ఆర్ నుంచి 30 శాతం నిధులను వెచ్చించేందుకు కృషి చేస్తామని సింహాద్రి జీజీఎం దివాకర్ కౌశిక్ స్పష్టం చేశారు.

సింహాద్రి జీజీఎం దివాకర్ కౌశిక్
పరవాడ, అక్టోబరు 29: సింహాద్రి నిర్వాసిత గ్రామాల్లో విద్యాభివృద్ధికి సీఎస్‌ఆర్ నుంచి 30 శాతం నిధులను వెచ్చించేందుకు కృషి చేస్తామని సింహాద్రి జీజీఎం దివాకర్ కౌశిక్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అడ్మిన్ బిల్డింగ్ ఆడిటోరియంలో సీఎస్‌ఆర్ వాటాదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీజీఎం మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు గాను సీఎస్‌ఆర్ ద్వారా తమ వంతు కృషి చేస్తామన్నారు. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే నిర్వాసిత గ్రామాల్లో మౌలిక వసతులు కూడా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలలకు క్రీడా పరికరాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, రూఫ్ టాప్ సోలార్, డ్యూయల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. అందుకు యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశంలో సింహాద్రి హెచ్‌ఆర్ ఏజీఎం ప్రేమ్‌చంద్, ఎంపీడీవో హేమసుందరరావు, సీఎస్‌ఆర్ ప్రతినిధులు కె.ప్రకాశరావు, సీహెచ్ రంగారావు, చారు పాతక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.