ద్వితీయ ఇంటర్‌లో ఆల్ పాస్
ABN , First Publish Date - 2021-07-24T05:55:24+05:30 IST
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు.

టెన్త్ 30 శాతం, ఫస్ట్ ఇయర్ 70 శాతం వెయిటేజీతో రెండో సంవత్సరం మార్కుల కేటాయింపు
జిల్లాలో విద్యార్థులు 54,380 మంది
మద్దిలపాలెం, జూలై 23: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతిలో మూడు బెస్ట్ సబ్జక్టులకు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ద్వితీయ సంవత్సరం మార్కులు కేటాయించారు. కొవిడ్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థికీ మార్కులను కేటాయించారు. పర్యావరణ, మానవీయ విలువల పరీక్షలకు సంబంధించి 35 మార్కులు ఇచ్చి ఉత్తీర్ణత కల్పించారు. ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడంతో ఆ మార్కులను యథావిధిగా కేటాయించారు. ప్రథమ సంవత్సరంలో బెటర్‌మెంట్‌కు ఫీజు చెల్లించిన విద్యార్థులకు పరీక్షలు రద్దు కావడంతో, అప్పటి మార్కులనే కేటాయించారు.
జిల్లాలో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 54,380 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరిలో జనరల్ రెగ్యులర్ బాలురు 24,664 మంది, బాలికలు 24,472 మంది, ప్రైవేట్‌గా బాలురు 507, బాలికలు 568 మంది ఉన్నారు. ఒకేషనల్ రెగ్యులర్‌లో బాలురు 1,514 మంది, బాలికలు 2,567 మంది, ప్రైవేటుగా బాలురు 50, బాలికలు 38 మంది పరీక్ష ఫీజులు చెల్లించారు. కమిటీ ఇచ్చిన మార్కుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను కళాశాలలు ప్రకటించలేదు.
అసంతృప్తి ఉంటే పరీక్షలు..
బోర్డు కేటాయించిన మార్కులపై అసంతృప్తి వుంటే బెటర్‌మెంట్ పరీక్షలు రాయడానికి బోర్డు అవకాశం కల్పిస్తుందని జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకురాలు బి.సుజాత తెలిపారు. కొవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాత బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.