మద్యం జోరు

ABN , First Publish Date - 2021-12-09T06:36:44+05:30 IST

ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుకోవడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది.

మద్యం జోరు

జిల్లాలో భారీగా పెరిగిన అమ్మకాలు

గత ఏడాదికంటే 26.39 శాతం ఎక్కువ

2020లో రూ.1561.44 కోట్ల అమ్మకం

2021లో రూ.1959.05 కోట్లు

ఆదాయం పెంచాల్సిందిగా ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు

దాంతో సమయపాలన పట్టించుకోని అధికారులు

తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ తెరిచివుంటున్న దుకాణాలు, బార్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుకోవడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులకు మౌఖికంగా ఉత్తర్వులు జారీచేసింది. వీలైనంత వరకూ విక్రయాలను పెంచాలని, అందుకోసం అందుబాటులో వున్న మార్గాలన్నింటినీ వాడుకోవాలని, ప్రతీనెలా నిర్దేశించిన లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలని ఆదేశించింది. దీంతో అధికారులు...దుకాణాలు, బార్ల సమయపాలన గురించి పట్టించుకోవడం మానేశారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ విక్రయించుకునేందుకు అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. దీనివల్ల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాది నెలకు సగటున రూ.120 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది రూ.163.25 కోట్లు జరిగాయి.


విశాఖ నగరంతోపాటు జిల్లాలో 266 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 124 బార్‌లు ఉన్నాయి. వీటిలో 70 దుకాణాలు, 116 బార్‌లు నగర పరిధిలో వుండగా, మిగిలినవి రూరల్‌ జిల్లాలో ఉన్నాయి. దుకాణాలు, బార్లకు అవసరమయ్యే మద్యం ఆనందపురం, అనకాపల్లి, నరవలోని ఐఎంఎల్‌ డిపోల ద్వారా సరఫరా జరుగుతుంది. నగరంతోపాటు తగరపువలస, భీమిలి ప్రాంతాల్లోని దుకాణాలకు డిపో-1 ద్వారా, పెందుర్తి సర్కిల్‌తోపాటు గాజువాక ప్రాంతాల్లోని దుకాణాలకు నరవలోని డిపో ద్వారా, రూరల్‌ జిల్లాలోని దుకాణాలన్నింటికీ అనకాపల్లిలోని డిపో-3 ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. 2020 (జనవరి-డిసెంబరు)లో మూడు డిపోల పరిధిలో రూ.1561.44 కోట్ల విలువైన మద్యం, బీర్లు విక్రయాలు జరిగితే, ఈ ఏడాది డిసెంబరు ఎనిమిదో తేదీ నాటికి రూ.1959.05 కోట్ల విలువైన మద్యం, బీరు విక్రయాలు జరిగాయంటే...ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అంటే నెలకు సగటున రూ.163.25 కోట్లు. రాష్ట్రంలో చాలా జిల్లాలతో పోల్చితే జిల్లాలోనే ఎక్కువ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారుల ప్రోత్సాహం కారణంగా గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాది 26.39 శాతం విక్రయాలు పెరిగాయి. అయితే...ఇంత చేసినప్పటికీ మరింత పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తమపై ఒత్తిడి పెంచుతోందని ఎక్సైజ్‌ శాఖకు చెందిన కొంతమంది అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో మద్యం విక్రయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల అమలుకు మద్యం విక్రయాలపైనే ఆధారపడుతున్నందున వాటి వివరాలను బయటకు వెల్లడిస్తే...తాము కఠినమైన చర్యలకు గురికావాల్సి వుంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలను పరిశీలిస్తే...గత ఏడాది డిపో-1 పరిధిలో రూ.503.83 కోట్ల విలువైన 4,86,319 మద్యం కేసులు, రూ.36 కోట్ల విలువైన 1,61,850 బీరు కేసులు విక్రయించారు. ఈ ఏడాది అదే డిపోలో 31.41 శాతం విక్రయాలను పెంచగలిగారు. డిపో-2 పరిధిలో గత ఏడాది రూ.503.83 కోట్ల విలువైన 4,81,835 మద్యం కేసులు, రూ.45.98 కోట్ల విలువైన 1,86,445 బీరు కేసులను విక్రయించగా, ఈ ఏడాది 7.26 శాతం విక్రయాలు పెరిగాయి. డిపో-3 పరిధిలో గత ఏడాది రూ.423.74 కోట్ల విలువైన 4,06,595 మద్యం కేసులు, రూ.40.47 కోట్ల విలువైన 1,60,035 బీరు కేసులు విక్రయించగా ఈ ఏడాది 40.40శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం విక్రయాల్లో 26.39 శాతం పెరుగుదల నమోదైంది.                      


ఇదీ లెక్క...

డిపో మద్యం అమ్మకాలు (రూ.కోట్లలో) బీర్లు అమ్మకం (కోట్లలో) మొత్తం విలువ

2020 2021 2020 2021 2020 2021 (డిసెంబరు 7 వరకూ)

డిపో-1 రూ.503.83 రూ.641.53 రూ.36.01 రూ.67.90 రూ.539.84 రూ.709.43 

డిపో-2 రూ.511.41 రూ.542.53 రూ.45.98 రూ.55.32 రూ.557.39 రూ.597.86

డిపో-3 రూ.423.74 రూ.578.55 రూ.40.47 రూ.73.21 రూ.464.21 రూ.651.76

మొత్తం రూ.1438.98 రూ.1762.61 రూ.122.46 రూ.196.43 రూ.1561.44 రూ.1959.05

Updated Date - 2021-12-09T06:36:44+05:30 IST