ఒమైక్రాన్‌ను ఎదుర్కొనడానికి ముందస్తు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-12-31T06:31:36+05:30 IST
విశాఖ జిల్లాలో ఒమైక్రాన్‌ను ఎదుర్కొనడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమైన పడకలు సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు సూచించారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ధనవంతులైనా చర్యలు
దేవస్థానం భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం
అభివృద్ధి పనుల పూర్తికి ప్రాధాన్యం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలో ఒమైక్రాన్‌ను ఎదుర్కొనడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమైన పడకలు సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. జిల్లాలో అభివృద్ధి పనులపై జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వివిధ శాఖల అధికారులతో వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి విడత 100శాతం, రెండో విడత 73శాతం పూర్తయిందన్నారు. మిగిలినది ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. ఒమైక్రాన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జనవరి నెలలో పిల్లలకు కూడా వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ఆక్రమణదారులు ధనవంతులైనా సరే ఉపేక్షించకూడదని స్పష్టంచేశారు. దేవస్థానం భూముల పరిరక్ష ణకు ప్రహరీ నిర్మించాలని, భక్తుల నడకదారికి కూడా అవసరమైన అంచనాలు వేసి నివేదిక పంపాలని సూచించారు. ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కొవిడ్ సెకెండ్ వేవ్ వచ్చినప్పుడు షీలానగర్‌లో ప్రగతి భారత్ ట్రస్టు తరఫున సేవలు అందించామని, అప్పుడు కొనుగోలు చేసిన 300 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, ఇతర ప్రత్యేక వైద్యపరికరాలు ఉన్నాయని, వాటిని విమ్స్, కేజీహెచ్‌కు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నగరంలో మధ్య తరగతి ప్రజలకు ఉద్దేశించిన ఎంఐజీ లేఅవుట్ల పనులు వేగవంతం చేయాలని, అర్హులకే అందేలా చూడాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డికి సూచించారు. భూ ఆక్రమణలపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ప్రశ్నించారు. వీఎంఆర్‌డీఏ లీజులు, షాపులపై ఆదాయం గురించి అడిగారు. లీజుకు తీసుకున్న షాపుల్లో బినామీలు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌కు సూచించారు. స్మార్ట్ సిటీ పనులను పరిశీలించాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషాను ఆదేశించారు. మురికివాడల ప్రజలకు జనవరిలో ఇళ్లపట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. సింహాచలం దేవస్థానం భూముల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, అలాగే భక్తులక నడకదారి నిర్మించాలని, దానికి తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ.5 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ కూడా రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఇస్తారని చెప్పారు. దేవస్థానం భూముల్లో నివసిస్తున్న పేదలు ఇళ్లు రిపేర్ చేసుకోవడానికి ఎన్‌ఓసీలు ఇవ్వాలని దేవస్థానం ఈఓ సూర్యకళను ఆదేశించారు. జిల్లాలో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలకు మరమ్మతులు చేయడానికి అవసరమైన అంచనాలు రూపొందించాలని ఆ శాఖ డీసీకి సూచించారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షిస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. ఇకపై అందులో నగరంతో పాటు గ్రామీణాభివృద్ధి అంశాలు కూడా చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ఏమి చేశారనే దానిపై మరో రెండు నెలల తరువాత సమీక్షించాలని, దానిపై నివేదిక ఇవ్వాలని కోరారు. సమావేశంలో విశాఖ ఎంపీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, విప్ బూడి ముత్యాలనాయుడు, జడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, మేయరు హరి వెంకటకుమారి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ విజయనిర్మల, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, గణేశ్‌కుమార్, అమర్‌నాథ్, అదీప్‌రాజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్లు వేణుగోపాలరెడ్డి, కల్పనాకుమారి, అరుణ్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.