సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-08-03T05:43:50+05:30 IST
సచివాలయం సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు.

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ హెచ్చరిక
విధులకు హాజరు కాని ఇద్దరు ఉద్యోగులకు మెమోలు జారీ
పాడేరు, ఆగస్టు 2: సచివాలయం సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు. మండలంలోని చింతలవీధి సచివాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయం రికార్డులు, సిబ్బది హాజరు పట్టీ పరిశీలించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పి.అనిల్ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ బి.మహేశ్వరమ్మ విధులకు హాజరు కాలేదని, హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో సెలవు నమోదు చేయలేదని పీవో గుర్తించారు. దీంతో వారిద్దరికీ మెమోలు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. మహిళా పోలీస్ కె.నూకరత్నం మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది క్షేత్ర పర్యటనకు వెళ్లినపుడు విధిగా మూవ్‌మెంట్ రిజిస్టరులో నమోదు చేయాలని పీవో ఆదేశించారు. సచివాలయ సిబ్బంది గ్రామస్థులకు అందుబాటులో ఉంటూ ప్రతీ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలన్నారు. అలాగే గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచాలని ఎంపీడీవోను ఆదేశించారు. పారిశుధ్య పనులు నిర్వచించి ఆ ఫొటోలు, తీసుకున్న చర్యలను తనకు నివేదించాలన్నారు. నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనాన్ని ఈనెల 16వ తేదీ నాటికి పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కుమార్‌ను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సమయ పాలన విధిగా పాటించాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు.