పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు

ABN , First Publish Date - 2021-10-19T06:22:21+05:30 IST

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)కు బకాయిలు గుదిబండగా మారాయి.

పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు

ఈపీడీసీఎల్‌కు ఒక్క విశాఖ జిల్లాలోనే రూ.153.29 కోట్లు

ప్రభుత్వ సంస్థల నుంచి రూ.45.97 కోట్లు

స్థానిక సంస్థల నుంచి రూ.107.32 కోట్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)కు బకాయిలు గుదిబండగా మారాయి. సాధారణ వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఏ నెలకా నెల ఠంచనుగా బిల్లులు చెల్లిస్తున్నా...ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు పెండింగ్‌ పెట్టేస్తున్నాయి. కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ఏ నెలకు ఆ నెల బిల్లు చెల్లించడం లేదు. పంచాయతీ కార్యాలయాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థల గురించి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. తాము కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి బిల్లులు చెల్లించకపోయినా ఏమీ కాదనే భావన వాటిలో కనిపిస్తోంది. వాస్తవానికి అదే ఈపీడీసీఎల్‌ అధికారుల చేతులను కట్టి పడేస్తోంది. సాధారణ వినియోగదారులకైతే ఇచ్చిన గడువులోగా బిల్లు చెల్లించకపోతే ఫ్యూజ్‌ తీసేసి సరఫరా నిలిపివేస్తారు. ఆ భయంతో వారు బిల్లులు కట్టేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు బకాయి పడితే...అధికారులు ఆ విధంగా సరఫరా నిలిపివేయలేకపోతున్నారు. కార్యకలాపాలు నిలిచిపోతాయని, తద్వారా ప్రభుత్వానికే నష్టం వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. పైగా ఆయా బిల్లులు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే రావలసి వున్నందున ఇక్కడ జాప్యం ఏమీ లేదనే భావనతో చర్యలకు తటపటాయిస్తున్నారు. దాంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ప్రభుత్వ సంస్థల నుంచి రావలసిన విద్యుత్‌ బకాయిలు సెప్టెంబరు నెలాఖరు నాటికి రూ.153.29 కోట్లుగా లెక్క తేల్చారు. అందులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావలసిన మొత్తం రూ.45.97 కోట్లు కాగా, స్థానిక సంస్థల నుంచి రావలసింది రూ.107.32 కోట్లు. 


తగ్గించుకుంటూ వస్తున్నారు

ఈ బకాయిలు ఒకానొక దశలో రూ.200 కోట్ల వరకు ఉండేవి. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి దీనిపై తగిన దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించడంతో ప్రతి మూడు, ఆరు నెలలకోసారి బిల్లులు చెల్లిస్తూ బకాయిలను తగ్గించుకుంటూ వస్తున్నారు.  విశాఖ సర్కిల్‌ నెలవారీ బిల్లుల మొత్తం రూ.410 కోట్లు కాగా...అందులో పదో వంతు ప్రభుత్వ సంస్థల వాటా ఉంటోంది. 

Updated Date - 2021-10-19T06:22:21+05:30 IST