వణికిస్తున్న ప్రమాదాలు

ABN , First Publish Date - 2021-07-09T05:27:48+05:30 IST

నగరానికి మణిహారంగా పేరొందిన బీచ్‌రోడ్డు విషాదానికి కేరాఫ్‌గా మారుతోంది. బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ డౌన్‌ యాక్సిడెంట్‌ జోన్‌గా మారింది.

వణికిస్తున్న ప్రమాదాలు
బుధవారం బోల్తా పడిన లారీ

పందిమెట్ట నుంచి బీచ్‌ రోడ్డులోకి దూసుకు వస్తున్న భారీ వాహనాలు

పల్లంగా ఉండడంతో అదుపుతప్పి బోల్తా

గత నాలుగేళ్లలో నాలుగు ప్రమాదాలు

శాశ్వత నివారణ చర్యలపై దృష్టి సారించని పోలీసులు


నగరానికి మణిహారంగా పేరొందిన బీచ్‌రోడ్డు విషాదానికి కేరాఫ్‌గా మారుతోంది. బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ డౌన్‌ యాక్సిడెంట్‌ జోన్‌గా మారింది. పందిమెట్ట వైపు నుంచి బీచ్‌రోడ్డుకి వచ్చేదారి బాగా పల్లంగా ఉండడంతో తరచూ వాహనాలు అదుపుతప్పి ఎదురుగా ఉన్న బీచ్‌ రిటైనింగ్‌ వాల్‌ను ఢీకొట్టి బోల్తా పడుతున్నాయి. దీంతో ప్రాణనష్టంతోపాటు ఆస్తినష్టం సంభవిస్తోంది. గత నాలుగేళ్లలో అక్కడే నాలుగు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. 


                                     (విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి)

  ఆర్కేబీచ్‌ వద్ద నోవాటెల్‌ డౌన్‌ వద్ద భౌగోళిక స్వరూపం కారణంగా బీచ్‌లోకి వెళ్లేసరికి రోడ్డు బాగా పల్లంగా ఉంటుంది. దీని వల్ల పందిమెట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు బీచ్‌రోడ్డుకి ప్రవేశించినప్పుడు డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు గురికావాల్సి వుంటుంది. బీచ్‌రోడ్డులో సందర్శకుల తాకిడి కారణంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ బీచ్‌రోడ్డులోకి భారీవాహనాలను అనుమతించరు. రాత్రి పది గంటల తరువాత సందర్శకుల తాకిడి నామమాత్రం కాబట్టి ఆ సమయం తరువాత  పోలీసులు వాహనాలను అనుమతిస్తారు. దీంతో బీచ్‌రోడ్డులో ఇసుక, రాళ్లు, ఇతర సామగ్రిని తీసుకెళ్లే వాహనాలు పందిమెట్ట నుంచి వచ్చినప్పుడు వేగంగా వస్తుంటాయి. నోవాటెల్‌ ఎదురుగా వచ్చేసరికి వాహనాలను అదుపుచేయాలని డ్రైవర్లు ప్రయత్నించినప్పుడు బ్రేకులు ఫెయిలైతే ఒకేసారి రోడ్డు డౌన్‌గా ఉండడం వల్ల వాహనాన్ని నియంత్రించేందుకు డ్రైవర్లకు ఏమాత్రం అవకాశం ఉండదు. దీంతో నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న బీచ్‌ రిటైనింగ్‌ వాల్‌ను ఢీకొట్టి వాహనాలు ఆగుతాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరైనా ఉన్నా, వాహనం బోల్తాపడినా సరే ప్రాణనష్టం తప్పడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు ఏదో హడావిడి చేసి తరువాత ఆ విషయాన్ని మరిచిపోతున్నారు. దీంతో తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత నాలుగేళ్లలో నాలుగు ప్రమాదాలు అక్కడే జరగడం పరిస్థితికి నిదర్శనం. 2017 మే ఒకటిన సాయంత్రం వేళ గేట్‌వే హోటల్‌ నుంచి బీచ్‌రోడ్డువైపు బయలుదేరిన ఓ విద్యాసంస్థ బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో నేరుగా రిటైనింగ్‌ వాల్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో రిటైనింగ్‌వాల్‌పై కూర్చొని కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్న అదనపు ఎస్పీ తండ్రి, కుమారుడు ప్రాణాలు కోల్పోగా, అదనపు ఎస్పీకి తీవ్ర గాయాలయ్యాయి. 2019 ఫిబ్రవరి ఏడున తెల్లవారుజామున ఇసుక లారీ పందిమెట్టవైపు నుంచి బీచ్‌రోడ్డులోకి వస్తూ డౌన్‌లో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో రిటైనింగ్‌ను ఢీకొట్టి కింద ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. 2020 ఫిబ్రవరి 12 తెల్లవారుజాము సమయంలో ఎక్సకవేటర్‌ను తీసుకువెళుతున్న లారీ బ్రైకులు ఫెయిల్‌ కావడంతో అదేచోట రిటైనింగ్‌వాల్‌ను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తాజాగా బుధవారం తెల్లవారుజామున ఫిషింగ్‌హార్బర్‌కు రాళ్లలోడుతో వెళుతున్న లారీ పందిమెట్ట జంక్షన్‌ నుంచి బీచ్‌రోడ్డులోకి దిగుతుండగా బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బీచ్‌రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఆ సమయంలో బీచ్‌రోడ్డులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

కొరవడిన శాశ్వత నివారణ చర్యలు

పర్యాటక ప్రాంతమైన బీచ్‌రోడ్డులో ఒకేచోట తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని బీచ్‌రోడ్డుకి వచ్చిన సందర్శకులు విమర్శిస్తున్నారు. పందిమెట్ట వైపు నుంచి వాహనాలు వచ్చినప్పుడు డౌన్‌ కారణంగా అదుపు తప్పే ప్రమాదం ఉన్నందున రోడ్డు డిజైన్‌ను మార్పు చేస్తే సమస్యను చాలావరకూ అధిగమించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బీచ్‌రోడ్డులోకి భారీవాహనాలను ఏ సమయంలో కూడా అనుమతించకుండా నిషేధం విధించాల్సి ఉన్నప్పటికీ ఎందుచేతనో ఆ పని చేయడం లేదని నిట్టూరుస్తున్నారు. బీచ్‌రోడ్డులోకి భారీ వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తే, తప్పనిసరి పరిస్థితిలో ప్రత్యమ్నాయ మార్గాలను డ్రైవర్లు ఉపయోగించుకుంటారని పేర్కొంటున్నారు. దీనిపై ట్రాఫిక్‌ ఏడీసీపీ సీహెచ్‌ ఆదినారాయణ వివరణ కోరగా బీచ్‌రోడ్డులోకి భారీ వాహనాల ప్రవేశాన్ని శాశ్వతంగా నిషేధించడంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు.


Updated Date - 2021-07-09T05:27:48+05:30 IST