క్షణికావేశంతో బలవన్మరణం

ABN , First Publish Date - 2021-12-19T06:13:22+05:30 IST

కుటుంబ కలహాలతో కంచరపాలెం ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గృహిణి ఈ నెల 9న ఆత్మహత్య చేసుకుంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. అదేరోజు మధురవాడలో ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

క్షణికావేశంతో బలవన్మరణం

ఈ నెలలో ఇప్పటివరకూ సుమారు 30 మంది వరకూ ఆత్మహత్య

మూడొంతులు 40 ఏళ్లలోపు వాళ్లే

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు...ప్రధాన కారణాలు

వివాహేతర సంబంధాలు కూడా...

తగ్గుతున్న సహనం

తాము అనుకున్నది కాకపోతే తట్టుకోలేకపోతున్న వైనం

సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమా..?

క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దంటూ మానసిక వైద్యుల సూచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

కుటుంబ కలహాలతో కంచరపాలెం ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గృహిణి ఈ నెల 9న ఆత్మహత్య చేసుకుంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. అదేరోజు మధురవాడలో ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మధురవాడ వుడా కాలనీలో నివాసం వుంటున్న 35 ఏళ్ల వ్యక్తి ఈ నెల ఆరో తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరచూ గొడవలు జరుగుతుండడంతో పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.

...ఇంచుమించు ఇటువంటి కారణాలతో ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో సుమారు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, కారణమేదైనా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని, తామున్నామన్న భరోసా కల్పించేవారు లేకపోవడం వల్లే చిన్న చిన్న సమస్యలకు కూడా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, యాంత్రికమైన బంధాలు, పరిధికి మించి కోర్కెలు, తదితరమైనవి ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. 

సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు.. 

సమస్య ఏదైనా...దానికి పరిష్కారం వుంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అన్ని సమస్యలకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారమైతే...లోకంలో మనిషన్న వాడే మిగలడు. సమస్య ఉన్నచోటే...దానికి పరిష్కారమూ ఉంటుంది. ఆ పరిష్కారాన్ని కనుగొనాల్సిన బాధ్యత సమస్యతో బాధపడుతున్న వ్యక్తిపైనే ఉంటుంది. కొన్నిసార్లు సమస్య పరిష్కారానికి శ్రమించాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు నిరీక్షించాల్సి ఉంటుంది. అంతేకానీ సమస్య నుంచి శాశ్వతంగా దూరం కావాలనే ఆలోచన చేయడం అవివేకమైన చర్య అవుతుంది. ఆత్మహత్య ఆలోచన ఎవరికైనా కలిగితే...వెంటనే ఆత్మీయులతో మాట్లాడాలి. అవసరమైన భరోసాను తీసుకోవాలి. అప్పుడే ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది. 

గత కొన్నేళ్లుగా ప్రజల్లో సహనం తగ్గుతోంది. తాను అనుకున్నది జరగాలనేతత్వం ప్రస్తుతం పెరిగింది. అనుకున్నది జరగని పక్షంలో తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాము అనుకున్న పని కాకపోతే...దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించకుండా...కొందరు ఆత్మహత్య చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. 


ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే.. 

ప్రస్తుతం సమాజంలో చాలామందిలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఇదికూడా ఆత్మహత్యలకు ప్రధానమైన కారణాల్లో ఒకటిగా ఉంటోంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం వల్ల చిరుద్యోగులు, వ్యాపారులు అప్పుల పాలవుతున్నారు. మరికొందరు గొప్పలకు పోయి అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేస్తున్నారు. అందుకోసం భారీ మొత్తంలో అప్పులు చేస్తూ...వాటిని తీర్చలేక కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తే ఎటువంటి సమస్యలూ వుండవని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యామ్నాయం గుర్తించాలి.. 

నగర పరిధిలోని మధురవాడ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని కొద్దిరోజుల కిందట ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు సకాలంలో గమనించడంతో ప్రాణాలతో బయటపడింది. ఆమెను ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా...ఎంసెట్‌ ప్రిపరేషన్‌ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపింది. ఎంసెట్‌ కాకపోతే...ఉన్న ప్రతిభను బట్టి మరో రంగంలో రాణించవచ్చునన్న విషయాన్ని ఆమెకు సదరు వైద్యుడు చెప్పడంతోపాటు...ఆ దిశగా ప్రోత్సహించాల్సిందిగా కుటుంబ సభ్యులకు చెప్పి పంపించారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎంతోమంది తాము కోరుకున్నది దక్కకపోతే అన్న ఒకే ఆలోచనలో ఉంటున్నారు తప్ప...దానికి ప్రత్యామ్నాయంగా పదుల సంఖ్యలో అవకాశాలున్నాయన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలను గుర్తించాలని సూచిస్తున్నారు. 


యాంత్రిక బంధాలతో.. 

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఎవరికి ఏ సమస్య వచ్చినా...తామున్నామన్న భరోసా లభించేది. ప్రస్తుతం  ఉదయం, నుంచి రాత్రి వరకు బిజీబిజీగా గడిపే తల్లిదండ్రులతో పిల్లలు తమ సమస్యలను చెప్పకోలేకపోతున్నారు. భార్య, భర్తలు కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోలేని పరిస్థితి. దీంతో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే..వాళ్లలో వాళ్లే మథనపడిపోతూ ఒత్తిడికి గురవుతున్నారు. మరొకరితో సమస్యను పంచుకోవడం వల్ల మనసులోని బరువు కొంత తగ్గుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.   


భార్యభర్తల మధ్య గొడవలు.. 

భార్య,భర్తల మధ్య గొడవలు, మనస్పర్థలకు రెండే కారణాలుంటున్నట్టు మానసిక నిపుణులు విశ్లేషి స్తున్నారు. వీటిలో మొదటిటి అహంకారం (ఇగో ప్రాబ్లమ్‌) కాగా, రెండోది వివాహేతర సంబంధాలు. మొదటి దానిలో ఒకరి మాటకు మరొకరు గౌరవమివ్వకపోవడం, తాము చెప్పిందే జరగాలని బలంగా కోరుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటూ పిల్లలను అనాథలను చేస్తున్నారు. అలాగే లేనిపోని కోర్కెలు, అవసరాలతో వివాహేతర సంబంధాలను పెట్టుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ రెండు కారణాలు వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.  


ముందే గుర్తించేందుకు అవకాశం

- డాక్టర్‌ భాగ్యారావు, మానసిక వైద్య నిపుణులు

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వున్న వారిని ముందుగానే గుర్తించవచ్చు. ఎప్పుడూ ఆత్మహత్యల గురించి, భవిష్యత్తు పట్ల నిరాశాజనకంగా మాట్లాడడం వంటి లక్షణాలుంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలతోపాటు సెరోటోనిన్‌ అనే పదార్థం లోపించిన వాళ్లలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇది లోపించిన వాళ్లు ఎక్కువగా నిరాశ, నిస్పృహలతో వుండడంతోపాటు ఆత్మహత్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇటువంటి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు అవసరమైన మందులు ఇస్తే ఆత్మహత్య ఆలోచనల నుంచి పూర్తిగా బయటకు వచ్చేందుకు అవకాశముంది. 


Updated Date - 2021-12-19T06:13:22+05:30 IST