ఆశల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-22T06:16:08+05:30 IST

క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పనిఒత్తిడితో సతమతమవుతున్నారు.

ఆశల ఆందోళన
ఆందోళన చేస్తున్న ఆశ కార్యకర్తలు (ఫైల్‌)

పెరిగిన పని భారం

క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు  చేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు

ట్యాబ్‌లు ఇవ్వకుండా ఎలా చేయగలమని ఆవేదన

జీతం పెంచిన తరువాత తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణ

వైద్య, ఆరోగ్యశాఖ, ఎంపీడీవోల మధ్య నలిగిపోతున్న ఏఎన్‌ఎంలు

యాప్‌లలో సమాచారం అప్‌లోడ్‌కే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. జీతం పెంచిన తరువాత ప్రభుత్వం తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటోందని ఆశ కార్యకర్తలు వాపోతున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికొక ఆశ కార్యకర్త వుంటే, ఇప్పుడు 2000-2500 మందికి సేవలు అందించాల్సి వస్తోందన్నారు. అదే నగర పరిధిలో గతంలో 2,500 మందికి సేవలు అందిస్తే, ఇప్పుడు 5-6 వేల మందికి అందించాల్సి వస్తోందంటున్నారు. తమను సచివాలయ వ్యవస్థకు అనుసంధానించడంతో అటు ఆ అధికారులకు, ఇటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు రిపోర్టు చేయాల్సి వస్తోందని, రెండు వైపులా పనిచేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఆశ వర్కర్లు ప్రధానంగా ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే చేసి, ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందజేయాలి. అయితే, ఆ పని ఇప్పుడు ఆన్‌లైన్‌లో చేయాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందంటున్నారు. అందుకు అనుగుణంగా తమకు ట్యాబ్‌లు గానీ స్మార్ట్‌ ఫోన్లు గానీ ఇవ్వకపోవడంతో ఇంటర్నెట్‌ కేంద్రానికి వెళ్లి సొంత డబ్బులు వెచ్చించి ఆ పనులు పూర్తిచేయాల్సి వస్తోందంటున్నారు. ఇందుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడం లేదంటున్నారు. అలాగే ఎన్నికల విధుల్లో తమను వినియోగించుకుంటున్న ప్రభుత్వం కనీసం రూపాయి కూడా ఇవ్వడం లేదంటున్నారు. నాలుగేళ్లుగా యూనిఫామ్‌ ఇవ్వడం లేదని, అలాగే ఇచ్చే పది వేలు ఒకేసారి కాకుండా కేంద్రం, రాష్ట్రం వంతులవారీగా విడుదల చేయడం వల్ల కొంత ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటున్నారు. జిల్లాలో 6,200 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. ఇందులో 600 మంది (ఇటీవల తీసుకున్నవారికి)కి మూడు నెలలుగా జీతాలు అందలేదు.


ఏఎన్‌ఎంల సమస్యలు

జిల్లాలో సుమారు మూడు వేల మంది వరకు వున్న ఏఎన్‌ఎంలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సచివాలయ హెల్త్‌ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన తరువాత వీరి సమస్యలు పెరిగాయి. ప్రస్తుతం వీరికి ఎంపీడీవోలు జీతాలు ఇస్తున్నందున తమకు రిపోర్టు చేయాలని వాళ్లు, వైద్య, ఆరోగ్య శాఖ పరిధి ఉద్యోగులు కాబట్టి తమ వద్దే పనిచేయాలని స్థానిక మెడికల్‌ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారు. వీరు...తమ పరిధిలో గర్భిణులు నమోదు నుంచి వారికి వ్యాక్సిన్‌ ఇప్పించడం, ప్రభుత్వం నుంచి సాయం అందేలా వివరాలను నమోదు చేయడంతోపాటు వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. వీటితోపాటు నాన్‌ కమ్యూనకబుల్‌ వ్యాధులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వీరే అన్‌లైన్‌లో నమోదుచేయాలి. ఒక పక్క ఫీల్డ్‌ వర్క్‌ చేస్తూ, మరోపక్క గంటల తరబడి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదుచేయాల్సి రావడం ఇబ్బంది కరంగా వుంటోందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే ఎవరైనా గర్భిణి ప్రసవం సమయం దగ్గరపడితే వారితోపాటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని, ఆ సమయంలో సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు వేయకపోతే సెలవుగా నమోదై వేతనం కట్‌ అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో తాము పనిచేస్తామని, ఆరోజు సచివాలయ సిబ్బంది రాకపోవడం వల్ల బయోమెట్రిక్‌ వేయలేని పరిస్థితి ఉంటోందని, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. 

Updated Date - 2021-03-22T06:16:08+05:30 IST