శబరిమలకు 60 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2021-11-10T05:24:13+05:30 IST

అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లి వచ్చేందుకు వీలుగా ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ నుంచి 60 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ అన్నారు.

శబరిమలకు 60 ప్రత్యేక బస్సులు
సమావేశంలో మాట్లాడుతున్న పీటీడీ విజయనగరం జోన్‌ ఈడీ చింతా రవికుమార్‌

 భక్తులకు బస్సులను అద్దెకిస్తాం

పీటీడీ విజయనగరం జోన్‌ ఈడీ చింతా రవికుమార్‌


ద్వారకాబస్‌స్టేషన్‌, నవంబరు 9: అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లి వచ్చేందుకు వీలుగా ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ నుంచి 60 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ అన్నారు.  ఈ సర్వీసుల టిక్కెట్ల రిజర్వేషన్‌ కోసం ద్వారకాబస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం  ప్యాకేజీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మొదటి ప్రత్యేక సర్వీసును ఈనెల 15న ద్వారకాబస్‌స్టేషన్‌లో ప్రారంభిస్తామన్నారు. భక్తులకోసం 5,6,7 రోజుల యాత్ర ప్యాకేజీలను రూపొందించామన్నారు.  డిమాండ్‌ను బట్టి కన్యాకుమారి నుంచి రామేశ్వరం వరకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేక సర్వీసులకు అలా్ట్ర డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ కోచ్‌లు ఆపరేట్‌ చేస్తామన్నారు.  ఈ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు.  రీజనల్‌ మేనేజర్‌ అంధవరపు అప్పలరాజు, డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్లు బి అప్పలనాయుడు (అర్బన్‌), సీహెచ్‌ అప్పలనారాయణ (జిల్లా), డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు కణితి వెంకటరావు (జిల్లా), కె పద్మావతి (అర్బన్‌), డిపో మేనేజర్లు గంగాధర్‌ (వాల్తేరు), ఢిల్లేశ్వరరావు (విశాఖపట్నం) తదితరులు పాల్గొన్నారు. 


శబరిమల ప్యాకేజీలు

5 రోజుల యాత్ర: విశాఖ నుంచి విజయవాడ,  మేల్‌మరత్తూర్‌, ఎరుమేలి, పంబ, సన్నిధానం చేరుకుని అక్కడ స్వామివారి దర్శనానంతరం తిరుగుప్రయాణమై శ్రీపురం, తిరుపతి, శ్రీకాళహస్తి,  అన్నవరం దర్శించుకుని విశాఖ చేరుకుంటుంది. ఇందుకు సూపర్‌లగ్జరీ సర్వీస్‌కు (ఒకరికి)రూ. 7,050,  ఆలా్ట్ర డీలక్స్‌కు రూ. 7,000, ఇంద్ర ఏసీ సర్వీస్‌కు రూ. 9,150,  అమరావతి సర్వీస్‌కు రూ. 11,500 టిక్కెట్టుగా నిర్ణయించారు. 


6 రోజుల యాత్ర: విశాఖ నుంచి కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ, సన్నిధానం దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం మీదుగా విశాఖ చేరుకుంటుంది.  ఇందుకు గాను(ఒకరికి) సూపర్‌లగ్జరీ సర్వీస్‌కు రూ. 7,450,  ఆలా్ట్ర డీలక్స్‌కు రూ. 7,400, ఇంద్ర ఏసీ సర్వీస్‌కు రూ. 9,650,  అమరావతి సర్వీస్‌కు రూ. 12,150 టిక్కెట్టుగా నిర్ణయించారు.


7 రోజుల యాత్ర: విశాఖ నుంచి కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ, సన్నిధానం దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతుంది. మధురై, రామేశ్వరం, తిరుపతి, విజయవాడ,  అన్నవరం మీదుగా విశాఖ చేరుకుంటుంది. ఇందుకు గాను (ఒకరికి) సూపర్‌లగ్జరీ సర్వీస్‌కు రూ. 8,050,  ఆలా్ట్ర డీలక్స్‌కు రూ. 8,000, ఇంద్ర ఏసీ సర్వీస్‌కు రూ. 10,400,  అమరావతి సర్వీస్‌కు రూ. 13,150టిక్కెట్టుగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం 9959225602, 7382914183, 9959221199, 7382921540, 9959225594  నంబర్లలో సంప్రతించాలని అధికారులు కోరారు. 

Updated Date - 2021-11-10T05:24:13+05:30 IST