55 నామినేషన్లు తిరస్కరణ

ABN , First Publish Date - 2021-02-06T07:03:04+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో దాఖలు చేసిన నామినేషన్లలో 27 పత్రాలను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు.

55 నామినేషన్లు తిరస్కరణ
నక్కపల్లిలో నామినేషన్లు పరిశీలిస్తున్న అధికారులు

 

కోటవురట్ల్ల, ఫిబ్రవరి5 : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో దాఖలు చేసిన నామినేషన్లలో 27 పత్రాలను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. సర్పంచ్‌ పదవికి 161 మంది దాఖలు చేయగా, శుక్రవారం జరిపిన పరిశీలనలో 19 మంది అభ్యర్థుల డబుల్‌ ఎంట్రీలను, ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. అలాగే, వార్డు స్థానాలకు 796మంది నామినేషన్లు వేయగా ఏడుగురి నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. 


‘పాయకరావుపేట’లో తొమ్మిది..

పాయకరావుపేట : మండలంలోని 24 సర్పంచ్‌ పదవులకు దాఖలు చేసిన 131 నామినేషన్లలో రెండు తిరస్కరణకు గురయ్యాయి. అలాగే, 264 వార్డు స్థానాలకు దాఖలైన 882 నామినేషన్లలో ఏడు వార్డు స్థానాలకు సంబంధించిన నామినేషన్లు వివిధ కారణాల రీత్యా అధికారులు తిరస్కరించారు. 


‘గొలుగొండ’లో ఆరు..

గొలుగొండ: మండలం లోని 27 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 138, వార్డు స్థానాలకు 810 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యల నామినేషన్లలో ఆరు పత్రాలను తిరస్కరించినట్టు మండల ఎన్నికల అధికారి డేవిడ్‌రాజ్‌ శుక్రవారం తెలిపారు. కృష్ణాదేవిపేటలో ఒకటి, కశిమిలో ఒకటి, కొత్తఎల్లవరంలో మూడు, రావణాపల్లిలో ఒకటి వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయన్నారు. 


 ‘నాతవరం’లో ఐదు..

నాతవరం: మండలంలోని మన్యపురట్ల, రాజుపేట అగ్రహారం పంచాయతీల్లో ఐదు వార్డు నామినేషన్లు తిరస్కరించినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూకరాజు తెలిపారు. మన్యపురట్ల పంచాయతీలో ఏడో వార్డులో పెద్దాడ కుమారి, రాజుపేట అగ్రహారం  రెండో వార్డులో నూకాలమ్మ, నాలుగో వార్డులో సబ్బవరపు వరహాలు, ఐదో వార్డులో రెడ్డి రమణమ్మ, తంగేటి రమణల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యా యన్నారు.


‘ఎస్‌.రాయవరం’లో నాలుగు...

ఎస్‌.రాయవరం : మండలంలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థులు, 15 వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించినట్టు ఎంపీడీవో చంద్రశేఖర్‌ శుక్రవారం తెలిపారు. వాకపాడు, ఉప్పరాపల్లి, వెంకటాపురం, భీమవరం పంచాయతీల నుంచి పలువురు అభ్యర్థులు వేసిన నామినేషన్లలో ఒక్కో  నామినేషన్‌ తిరస్కరణకు గురైందన్నారు. దీంతో 141 సర్పంచ్‌ నామినేషన్లు, 895 వార్డు నామినేషన్లు ఓకే అయ్యాయని వివరించారు. 


‘నర్సీపట్నం’లో  రెండు..

నర్సీపట్నం అర్బన్‌: మండలంలోని పన్నెండు పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 72 మంది నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.  480 మంది వార్డు స్థానాలకు పత్రాలు సమర్పించారు. వీటిలో ఎరకన్నపాలెం ఒకటో వార్డుకు పెదపూడి సత్తిబాబు ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఇదిలావుంటే, చెట్టుపల్లి ఎనిమిదో వార్డులో కోన అప్పారావు, గబ్బాడ ఆరో వార్డులో నడిగట్ల యల్లన్న నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.


‘నక్కపల్లి’లో రెండు..

నక్కపల్లి: మండలంలో రెండు వార్డులు మినహా 31 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు స్థానాలకు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. ఈ మండలంలో 33 పంచాయతీలుండగా హైకోర్టు తీర్పు కారణంగా దోసలపాడు, చీడిక గ్రామ పంచాయతీల ఎన్నికలను నిలిపివేశారు. దీంతో 31 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో సర్పంచ్‌  స్థానాలకు 151 నామినేషన్లు, వార్డు  సభ్యులకు 939 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు సంబంధించి రాజయ్యపేట పంచాయతీలో రెండు వార్డు  నామినేషన్లను శుక్రవారం నాటి పరిశీలనలో తిరస్కరించారు. దీంతో 937 వార్డులకు ఎన్నిక జరగాల్సివుంది. వీటిలో బంగారమ్మపేటలో 10,బోదిగల్లంలో 7, గుల్లిపాడులో 8 వార్డులు, ముకుందరాజుపేటలో 8, వేంపాడులో  12 వార్డుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నక్కపల్లి మండలంలో మొత్తం మీద 45 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-02-06T07:03:04+05:30 IST