ముగిసిన ఉక్కు ఉద్యోగుల 25 గంటల దీక్ష

ABN , First Publish Date - 2021-10-21T06:07:53+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన 25 గంటల దీక్షలు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ముగిశాయి.

ముగిసిన ఉక్కు ఉద్యోగుల 25 గంటల దీక్ష
కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న కృష్ణారావు

యథావిధిగా రోజువారీ దీక్షలు

కూర్మన్నపాలెం, అక్టోబరు 20: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన 25 గంటల దీక్షలు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ముగిశాయి. ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 250వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 250 మంది  పాల్గొన్నారు. వీరికి పబ్లిక్‌ సెక్టార్‌ కమిటీ జాతీయ కన్వీనర్‌, సీఐటీయూ నాయకుడు కుమార మంగళం, రాష్ట్ర టెక్నికల్‌ డైరెక్టర్‌ (రిటైర్డు) వై.కృష్ణారావులు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా కుమార మంగళం మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ అందరి కర్తవ్యంగా భావించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు లేకపోతే ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్నారు. వై.కృష్ణారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు రంగానికి అప్పగిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు జె.రామకృష్ణ, రమణారెడ్డి, మహాలక్ష్మినాయుడు, బొడ్డు పైడిరాజు, కుమార్‌, రామారావు, మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉద్యోగులు నిర్వహిస్తున్న రోజువారీ దీక్షలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-10-21T06:07:53+05:30 IST