ఆ కుటుంబానికి దిక్కెవరు?
ABN , First Publish Date - 2021-09-04T05:26:07+05:30 IST
ఆ కుటుంబానికి దిక్కెవరు?

- పింఛన్ కోసం వెళ్లి భర్త మృతి
- కరోనాతో కుమారుడు..
- క్యాన్సర్‌తో పోరాడుతున్న మరో కొడుకు
- నిస్సహాయస్థితిలో తల్లి
(టెక్కలి రూరల్)
ఆ కుటుంబంలో ఏడాదిగా అలజడి మొదలైంది.. ఒక కొడుకు కరోనాతో మృత్యువాత పడితే.. భర్త పింఛన్ కోసం వెళ్లి వస్తూ మృతి చెందాడు.. మరో కుమారుడు క్యాన్సర్‌తో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో నిస్సహాయ స్థితిలో తల్లి తల్లడిల్లుతోంది.. ఆ కుటుంబానికి దిక్కెవరు అని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. టెక్కలి శంభాన వీధిలో నివాసముంటున్న చౌదరి లక్ష్మీనారాయణ, శాంతామణికి ఆరుగురు సంతానం. వీరిలో నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఈయన ఆర్టీసీలో పనిచేసి రిటైరయ్యారు. కుమార్తెలు నలుగురికి వివాహం చేశారు. పెద్దకుమారుడు రాంప్రసాద్, చిన్న కుమారుడు శ్యామ సుందరరావు(శ్రీను). వీరిద్దరూ ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో పనిచేసేవారు. అయితే గత ఏడాది అక్టోబరులో చిన్న కుమారుడు శ్యామ సుందరరావుకు నోటి క్యాన్సర్‌గా నిర్ధారణ కావడంతో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేశారు. స్థోమతకు మించి ఖర్చు చేసినా ఏడాదిగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక కష్టాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. ఈ ఏడాది మే నెలలో పెద్ద కుమారుడు రాంప్రసాద్ కరోనాతో మృతి చెందాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇది లాఉండగా ఈనెల ఒకటిన లక్ష్మీనారాయణ పలాస వెళ్లి పింఛన్ అందుకున్న అనంతరం ఆకస్మికంగా మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోనట్లయింది. పెద్ద కుమారుడు, భర్త మృతి చెందడం, చిన్న కుమారుడు మంచాన ఉండడంతో ఆమెను వారించడం ఎవరితరం కావడం లేదు. మంచాన పడిన సోదరునికి నలుగురు సోదరిలు సమర్యలు చేస్తున్నారు. ఆ కుటుంబ దీనస్థితిని చూసి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరని ఆవేదనకు గురవుతున్నారు.