బంగారం ఎవరు కొన్నారు.. ఎక్కడ కొన్నారు!

ABN , First Publish Date - 2021-01-12T06:04:44+05:30 IST

‘ఆదిత్యుని బంగారు మకరణ తోరణం తయారీకి సంబంధించి విరాళాల సేకరణ పారదర్శకంగా చేశాం. రూ.68.30 లక్షలతో బంగారం కొనుగోలు చేశాం. ఇంకా రూ.15 లక్షలు అవసరముంది.

బంగారం ఎవరు కొన్నారు..  ఎక్కడ కొన్నారు!



బంగారం ఎవరు కొన్నారు..

ఎక్కడ కొన్నారు!

మకర తోరణం విషయంలో భక్తుల్లో సందేహాలెన్నో..

నివృత్తి చేయని కమిటీ సభ్యులు

శ్రీకాకుళం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘ఆదిత్యుని బంగారు మకరణ తోరణం తయారీకి సంబంధించి విరాళాల సేకరణ పారదర్శకంగా చేశాం. రూ.68.30 లక్షలతో బంగారం కొనుగోలు చేశాం. ఇంకా రూ.15 లక్షలు అవసరముంది. ఈ నిధులను దాతల నుంచి సేకరించనున్నాం’.. అంటూ ఇటీవల ఆలయ ఈవో హరిసూర్యప్రకాశరావు, మకరతోరణం కమిటీ సభ్యులు ఇప్పిలి శంకరశర్మ, మండవిల్లి రవి, కె.సూర్యనారాయణలు చెప్పారు. ఆదిత్యుని ఆలయంలో ఒక షాడో నేత మితిమీరిన జోక్యంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఆగమేఘాల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. మకరతోరణం విషయంలో భక్తుల సందేహాలకు సరైన సమాధానం దొరకలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భక్తులు నగదు రూపంలో కానుకలు అందిస్తే.. బంగారం కొనుగోలు చేసినట్టు చెబుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నగదు కానుకలు ఇచ్చిన భక్తులకు రసీదు ఎందుకు ఇవ్వడం లేదు..? భక్తులు ఆన్‌లైన్‌లో ఎందుకు చెల్లించడం లేదు? దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాకు నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లించే విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ఒకవేళ చెక్కులు, నగదు రూపంలో కానుకలు అందిస్తే ఆ మొత్తం ఎవరి ఖాతాలో జమ అవుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే దొరకడం లేదు. సూర్యదేవుని మకరతోరణం కోసం సేకరించిన నగదుతో  బంగారాన్ని ఏ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నారు? ఎవరు కొంటున్నారు అనే భక్తుల ప్రశ్నలను కూడా నివృత్తి చేయలేకపోతున్నారు.  మకరతోరణం విషయంలో అంతా పారదర్శకమంటున్న కమిటీ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని భక్తులు కోరుతున్నారు. సాధారణంగా ఇంటి అవసరాలకు ఒక చిన్న బంగారు వస్తువు కొనాలన్నా... అందుకు ఎంత నగదు అవసరం? ఎవరి వద్ద కొనాలి అనేది ఒక అంచనా వేసుకొంటాం. అంతే కాకుండా ఒక గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా, కనీసం రెండు మూడు దుకాణాల్లో వాకబు చేస్తాం. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ కొనుగోలు చేస్తుంటాం. రూ.68.30 లక్షల విలువైన సుమారు ఒక కిలో 630 గ్రాముల బంగారాన్ని ఎక్కడ కొన్నారో.. ఎవరు కొన్నారో చెప్పలేకపోతున్నారు. విరాళాల రూపంలో వచ్చిన నగదుతో ఎప్పటికప్పుడు బంగారం  కొనుగోలు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారి చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భక్తులు సూర్యదేవుని దర్శించుకున్న తరువాత ఆలయంలోనే దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళ్లి నగదు అందజేస్తున్నారు. వాస్తవానికి బంగారం రూపంలో భక్తులు కానుకలు ఇస్తే... స్వీకరించడంలో తప్పులేదు. అలా కాకుండా మకరతోరణం కోసం నగదు కానుకలు అందజేసే భక్తులకు ఇచ్చిన నగదుకు ఆలయ కమిటీ తరుఫున రసీదు వెంటనే అందజేయాలి.  అరసవల్లి ఆలయంలో ఈ విధానం పాటించడం లేదు. దేవాదాయ శాఖ అధికారులు షాడోతో మనకెందుకు అనుకున్నారో ఏమో గానీ, ఆలయంలో సూర్యదేవుని సాక్షిగా భక్తులు గత  ఏడాది కాలంగా అందిస్తున్న నగదు కానుకలకు రసీదులు ఇవ్వలేదు. దీనిపై మకరతోరణం కమిటీ బదులిస్తూ.. భక్తులు ఇచ్చే నగదుకు రథసప్తమికి మకరతోరణం స్వామి వారికి అలంకరించిన తరువాత రసీదు ఇస్తామని పత్రికా ప్రకటన చేయడం విస్మయానికి గురి చేస్తోంది. మకరతోరణం ఏర్పాటు కోసం ఆలయ పాలకమండలిలో సభ్యుడు ఒక కమిటీ ఏర్పాటు చేసి మొత్తాన్ని తనవద్ద ఎలా ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి వచ్చిన నగదుకు రసీదులు ఇవ్వాలని కోరుతున్నారు.  



Updated Date - 2021-01-12T06:04:44+05:30 IST