కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించేదెప్పుడో?

ABN , First Publish Date - 2021-02-05T05:30:00+05:30 IST

జిల్లాలో సముద్రతీరంలో కోల్డ్‌స్టోరేజ్‌లు లేక చేపలు నిల్వ చేయడానికి మత్స్యకారులు అవస్థలుపడుతున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో 104 గ్రామాల్లో 3584 రిజిస్టర్‌ బోట్లు ఉన్నాయి.

కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించేదెప్పుడో?
కోల్డ్‌ స్టోరేజీ లేక ఇసుక తెన్నులపై ఆరబెట్టిన చేపలు

 మార్కెట్‌ సదుపాయం లేక తక్కువ ధరకు విక్రయం 

 నష్టపోతున్న మత్స్యకారులు

ఇచ్ఛాపురం రూరల్‌: జిల్లాలో సముద్రతీరంలో కోల్డ్‌స్టోరేజ్‌లు లేక చేపలు నిల్వ చేయడానికి మత్స్యకారులు అవస్థలుపడుతున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో 104 గ్రామాల్లో 3584 రిజిస్టర్‌ బోట్లు ఉన్నాయి. ఇందులో 14,280 మంది మత్స్యకారులు వేటసాగిస్తున్నారు. వీరేకాకుండా చిన్నతెప్పలపై మరో 12 వేల మంది వరకు మత్స్యకారులు వేటచేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో కోనాం, కనాగర్తలు, బొంతలు, కలువలు, టేకుచేపలు పలు రకాల చేపలు పుష్కలంగా లభిస్తున్నాయి. ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలకు మార్కెటింగ్‌ సదుపాయం లేక తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నామని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కోల్డ్‌స్టోరేజీలు ఎప్పుడు నిర్మిస్తారోనని ఎదురుచూస్తున్నారు.

తక్కువ ధరకు విక్రయం

ఒక్కో బోటుకు గరిష్టంగా మూడు టన్నుల వరకు చేపలు పడుతున్నాయి. నిల్వకు సదుపాయాలు లేక కొందరు స్థానికంగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మిగతా చేపలను కోల్డ్‌స్టోరేజీ లేక సముద్రపు ఇసుకలో ఎండబెట్టుకుంటున్నారు. తాజా చేపల కేజీ రూ.130 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఎండబెట్టిన చేపలు మార్కెటింగ్‌ చేస్తుంటే కేజీ రూ.25 కూడా రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఒకేసారి ఎక్కువ చేపలు దొరికితే చేపలు నిల్వ చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో  చిన్న చేపలను సముద్రతీరంలోనే విడిచిపెడు తున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో మహిళా జన్మభూమి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డొంకూరు వచ్చినప్పుడు ఇక్కడ కోల్డ్‌స్టోరేజీ నిర్మిస్తామని, మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని హామీఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని పలువురు వాపోతున్నారు.

ఇసుకలోనే ఎండబెడుతున్నాం...

వేటకు అనుకూలమైన సీజన్‌ కావడంతో మత్స్యకారులకు చేపలు అధికంగా దొరుకుతున్నాయి. అవి నిల్వచేయడానికి కోల్డ్‌స్టోరేజీ లేకపోవడంతో తీరంలోనే ఇసుకలో ఎండబెట్టుకుంటున్నాం. తాజా చేపల ధర కన్నా, ఎండబెట్టగా అమ్మిన చేపల విలువ దాదాపు పది రెట్లు తక్కువగా ఉంటుంది. దీంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.

-సీహెచ్‌ నూకయ్య, మత్స్యకారుడు, డొంకూరు.

 కోల్డ్‌ స్టోరేజీ నిర్మించాలి..

స్వయాన ముఖ్యమంత్రి గ్రామానికి వచ్చి ఇచ్చిన హామీ కూడా ఇంత వరకు నెరవేరలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మత్స్యకారుల బతుకు మారడం లేదు. రాత్రి సమయాల్లో వేటకు వెళ్లి తెచ్చిన చేపలు నిల్వ చేయలేక అవస్థలు పడుతున్నాం.  గత్యంతరం లేక ఎండబెట్టుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మించాలి

-సోమేష్‌, డొంకూరు మత్స్యకారుడు

 మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తాం

ప్రస్తుతం జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమే. సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నాం. ఈ సీజన్‌లో మత్స్యకారులకు విలువైన కోనెం, పార, సోర చేపలు, నెత్తల్లు వంటి విలువైన చేపలు పాడవకుండా కాపాడుకోవడానికి ఐస్‌ బాక్స్‌లు సరఫరా చేస్తున్నాం.


Updated Date - 2021-02-05T05:30:00+05:30 IST