ఏమిటీ రోడ్ల విస్తరణ?
ABN , First Publish Date - 2021-10-30T05:12:04+05:30 IST
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రోడ్ల విస్తరణ చేస్తామని షాపులన్నీ తొలగించారు.. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ వజ్జ బాబూరావు ధ్వజమెత్తారు. చైర్మన్ బళ్ల గిరిబాబు అధ్యక్షతన మునిసిపల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.

కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ధ్వజం
పలాస, అక్టోబరు 29: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రోడ్ల విస్తరణ చేస్తామని షాపులన్నీ తొలగించారు.. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ వజ్జ బాబూరావు ధ్వజమెత్తారు. చైర్మన్ బళ్ల గిరిబాబు అధ్యక్షతన మునిసిపల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ... జిల్లాలో మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెప్పారని, వ్యాపారులు కూడా ఎంతో ఆశతో రోడ్డు విస్తరణకు అంగీకరించి రూ.కోట్ల విలువైన షాపులు ధారా దత్తం చేశారన్నారు. అయితే కాలువ నిర్మాణంలోనూ అవకతవ కలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాలువ వెడల్పు పెంచాలని కోరారు. దీనిపై చైర్మన్ గిరిబాబు స్పందిస్తూ.. ఇంజినీరింగ్ అధికారుల అంచనాల మేరకు కాలు వ నిర్మాణం జరుగుతుందన్నారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ పి.ప్రసాద రావు మాట్లాడుతూ.. కాలువ ఎంత వెడల్పుతో నిర్మిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీడీపీ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉదయపురం, మునిసిపల్ కార్యాలయం రోడ్డులో కల్వర్టులు ధ్వంసమవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. జోగ త్రివేణి (టీడీపీ) మాట్లాడుతూ.. తన వార్డులో బోర్లు పనిచేయ డం లేదని, ప్రజలు నీటి కోసం ఇక్కట్లకు గురవుతున్నారన్నారు.
ఆదర్శ వార్డు అన్నారు..!
18వ వార్డును అధికారులు ఆదర్శ వార్డుగా ఎంపిక చేశారని, ఆ తర్వాత ఈ వార్డులో చెత్త సేకరణ పూర్తిగా మరిచిపోయిందని, దీనిపై ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుగా ఉందని ఆ వార్డు కౌన్సిలర్ సనపల సింహాచలం (వైసీపీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ వార్డుగా ఎంపిక చేసి చెత్త సేకరణకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సమావేశం లో కమిషనర్ రాజగోపాలరావు, వైస్ చైర్మన్లు బోర కృష్ణారావు రెడ్డి, మీసాల సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.