ఎంతైనా ఇస్తాం..పట్టాలివ్వండి!

ABN , First Publish Date - 2021-03-23T05:17:49+05:30 IST

స్థలానికి ఎంత నగదైనా ఇస్తాం. పట్టాలు వచ్చేటట్టు చూడండి’..అంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ అక్రమార్కులు తిరుగుతున్నారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో మెళియాపుట్టిలో భూ ఆక్రమణలపై ‘ఎకరా రూ.కోటి..చేసుకో లూటీ’ అని వచ్చిన కథనం ఆక్రమణదారుల గుండెల్లో

ఎంతైనా ఇస్తాం..పట్టాలివ్వండి!
సాయిబాబా మందిరం మార్గంలో నిర్మాణాలు జరుగుతున్న దృశ్యం



ఎంతైనా ఇస్తాం..పట్టాలివ్వండి!

ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న ఆక్రమణదారులు

సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్న మెళియాపుట్టి వాసులు

(మెళియాపుట్టి)

‘ఆక్రమించిన స్థలానికి ఎంత నగదైనా ఇస్తాం. పట్టాలు వచ్చేటట్టు చూడండి’..అంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ అక్రమార్కులు తిరుగుతున్నారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో మెళియాపుట్టిలో భూ ఆక్రమణలపై ‘ఎకరా రూ.కోటి..చేసుకో లూటీ’ అని వచ్చిన కథనం ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులకు కలుస్తూ గండం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. కథనం స్థానికంగా కూడా చర్చనీయాంశమవుతోంది. మెళియాపుట్టి గ్రామానికి చెందిన పట్నాన కుమారి ఆక్రమణలపై విచారణ చేపట్టాలని తహసీల్దారు అప్పలసూర్యనారాయణకు ఫిర్యాదుచేశారు. తాను టీ దుకాణం నడుపుకొని జీవిస్తుంటే ఆక్రమణ పేరిట యంత్రాలతో కూల్చివేశారని..ఇప్పుడు కళ్లెదుటే ఆక్రమణలు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం..పెద్దవారికి ఒక న్యాయమా అంటూ ఆమె ప్రశ్నించారు. మండల కేంద్రంలో భూ ఆక్రమణల విషయంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 


ఆగని ‘అక్రమ’ నిర్మాణాలు

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొందరు ఇప్పటికే పాగా వేయగా..మరికొందరు పనులు చేపడుతున్నారు. సాయిబాబా మందిరానికి వెళ్లే మార్గంలో కొందరు యథేచ్ఛగా షాపులు నిర్మిస్తున్నారు. వీటిని పూర్తిచేసి అద్దెకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్వే నంబర్‌ 486లో ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి కేటాయించిన స్థలంలో సైతం నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు మెళియాపుట్టి కొండ చుట్టూ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొందరైతే ఏకంగా రెండు ఫ్లోర్లలో నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పుడు వారంతా పట్టాల కోసం అధికారుల చుట్టే తిరుగుతున్నారు. ఎలాగైనా పట్టాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆక్రమణలపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తిరుమరెడ్డి ప్రసాదరావు అనే వ్యక్తి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎప్పుడు ఏ నిర్ణయం వస్తుందోనని అక్రమార్కులు భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులను ముందస్తుగానే ఆశ్రయిస్తున్నారు. మండల కేంద్రంలో ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన నాయకుడు సాయిప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. 





Updated Date - 2021-03-23T05:17:49+05:30 IST