వేతనాల్లో కోత
ABN , First Publish Date - 2021-10-30T04:28:26+05:30 IST
వేతనాల్లో కోత
- సచివాలయాల్లో బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు
- ఆందోళన చెందుతున్న ఉద్యోగులు
(ఇచ్ఛాపురం)
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాల్లో కోత పడనుంది. వారి బయోమెట్రిక్ హాజరు పరిగణనలోకి తీసుకుని... వచ్చే నెలకు సంబంధించి ఇప్పటికే వేతన బడ్జెట్ వేశారు. దీంతో సకాలంలో విధులకు వెళ్లలేకపోయిన వారు.. ఉద్యోగ రీత్యా మండల కార్యాలయాల్లో శిక్షణ, సమావేశాలకు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. జిల్లావ్యాప్తంగా 930 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 8,974 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వం హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి రూ.15వేల చొప్పున జీతం అందజేస్తోంది. రెండేళ్ల ప్రొబేషన్ అనంతరం సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గతంలో ప్రకటించింది. దీంతో ఎక్కువ వేతనంతో ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు సైతం రాత పరీక్షలు రాసి సచివాలయాల్లో కొలువుదీరారు. నెలకు వచ్చే రూ.15వేల వేతనంతో సరిపెట్టుకుంటూ విఽధులు నిర్వహిస్తున్నారు. ప్రొబేషనరీ సమయం ముగిసినా ఇంకా రెగ్యులర్ కాలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇప్పటికే వారి తల్లిదండ్రుల పింఛన్లు, బియ్యం కార్డులు, ఇతరత్రా సంక్షేమ పథకాలను నిలిపేశారు. తాజాగా వేతనంలో కూడా కోతకు రంగం సన్నద్ధమవుతోంది. ప్రతిరోజూ సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగులంతా సచివాలయాల్లో ఉండాలని, అర్జీలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా నివాసం ఉండాలని స్పష్టం చేసింది. కానీ, చాలామంది దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో సకాలంలో సచివాలయాలకు చేరుకోవడం లేదు. అటువంటి వారందరి వేతనాల్లో కోత పడనుంది. ప్రస్తుతం ఉద్యోగుల ఐడీల ద్వారా వారు ఈ నెలలో ఎన్ని రోజులు విధులకు హాజరయ్యారు? వచ్చే నెలకు ఎంత జీతం వస్తుంది. తదితర వివరాలతో కూడిన జాబితాను ప్రభుత్వం జిల్లాకేంద్రానికి పంపింది. ప్రతి నెలా 20 నుంచి తర్వాత నెల 21వ తేదీ వరకు హాజరు వివరాలు సచివాలయ ఉద్యోగులు పంపాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబరు నుంచి వేతనం ఇవ్వాలని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సగం మంది ఉద్యోగులకు వారి హాజరును బట్టి రూ.1000 నుంచి రూ.8 వేల వరకు కోత పడింది. ఆఫ్‌లైన్ హాజరు జాబితాను పరిగణనలోకి తీసుకున్న ఉద్యోగులకు మాత్రం వంద శాతం వేతనం ఇస్తారు. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, పింఛన్లు, బియ్యం కార్డుల అర్హుల ఎంపిక ప్రక్రియను సచివాలయాలకే ప్రభుత్వం అనుసంధానం చేసింది. మీసేవా కేంద్రాలకు ఉండే 543 రకాల సేవలను అక్కడికే బదలాయించింది. పథకాల పునఃపరిశీలనలో భాగంగా రెండో శనివారం, ఆదివారం కూడా విధులకు వస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జీతాల్లో కోత విధించడమేమిటి అంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు
సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు చెల్లిస్తాం. సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల జీతాల్లో కోత తప్పదు.
- రవి కుమార్, డీపీవో, శ్రీకాకుళం