అతిక్రమణకు తప్పదు జరిమానా!

ABN , First Publish Date - 2021-05-31T05:11:22+05:30 IST

అతిక్రమణకు తప్పదు జరిమానా!

అతిక్రమణకు తప్పదు జరిమానా!
హరిపురం : వరుడుతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ పాపారావు

వివాహ వేడుకల్లో కొవిడ్‌ నిబంధనలకు తూట్లు

అధికారుల విస్తృత తనిఖీలు

గీతదాటిన వారిపై అపరాధ రుసుం విధింపు


జిల్లాలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజల్లో చైతనం కానరాడం లేదు.  వందల మంది అతిథుల నడుమ వివాహ వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ మేరకు ఆదివారం వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించి వివాహాలు చేసుకున్న నిర్వాహకులపై అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతిచ్చిన 20 మందికి మించి అతిథులను ఆహ్వానించిన వారిపై అపరాధ రుసుము విఽధించారు. వివాహాలు నిర్వహిస్తున్న ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసులు అధికారులు వెళ్లి వంటకాలను సైతం పరిశీలించారు.


సోంపేట : మండలంలోని జింకిభద్ర, బెంకిలిల్లో ఆదివారం కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వివాహ నిర్వాహకులపై అధికారులు అపరాధ రుసుము విధించారు. నిబంధనల మేరకు వివాహానికి 20 మందికే అనుమతి ఉండగా, ఒక్కోచోట 100 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో జింకిభద్ర గ్రామానికి చెందిన టి.ధర్మారావు, బెంకిలి గ్రామానికి చెందిన కె.తేజేశ్వరరావులకు ఒక్కక్కరికీ రూ.20వేలు చొప్పున అపరాధ రుసుము విధించినట్టు తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌, ఎస్‌ఐ కె.వెంకటేష్‌  తెలిపారు. వీరివెంట రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.


రాధాకృష్ణాపురంలో...

హరిపురం : మందస మండలంలోని రాధాకృష్ణాపురంలో కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించిన వివాహ నిర్వాహకులపై ఆదివారం అధికారులు రెండువేల రూపాయల జరిమానా విధించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు 20 మంది అతిథులతో వివాహం నిర్వహించుకోవాలని అనుమతినిచ్చారు. అయితే వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు స్థానికులు ఫిర్యాదుచేయ డంతో తహసీల్దార్‌ పాపారావు, ఎస్‌ఐ బి.రామారావు పరిశీలించారు. వేడుకలో 40 మంది వరకు అతిథులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెండ్లి కుమారుడు వల్లభ అశోక్‌కు రూ.రెండు వేలు జరిమానాను తహసీల్దార్‌ బి.పాపారావు విధించారు. అనంతరం అతిఽథులను అక్కడి నుంచి పంపించేశారు. ఈయన వెంట ఆర్‌ఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు. 


మూడు గ్రామాల్లో...

ఆమదాలవలస రూరల్‌ : దూసి, చేపేనపేట, మర్రికొత్తవలసలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం వివాహ వేడుకలు నిర్వహించడంతో రెవె న్యూ సిబ్బంది నిర్వాహకులపై అపరాధ రుసుము విధించారు. తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది వివాహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అనుమతిచ్చిన కంటే ఎక్కువ మంది పాల్గొనడంతో దూసిలో రూ.పది వేలు, సేపానపేటలో రూ.20 వేలు, మర్రికొత్తవలసలో రూ.ఐదు వేలు చొప్పున్న అపరాధ రుసుము విధించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు, డీటీ జి.రామకృష్ణ  పాల్గొన్నారు.


Updated Date - 2021-05-31T05:11:22+05:30 IST