టెక్కలిలో వైసీపీ శ్రేణుల వీరంగం
ABN , First Publish Date - 2021-10-21T05:19:19+05:30 IST
టెక్కలిలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. బుధవారం ఉదయం రోటరీనగర్-3లోని టీడీపీ కార్యాలయంపై దాడికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మెరైన్ సీఐ దేముళ్ళు, టెక్కలి ఎస్‌ఐలు కామేశ్వరరావు, రామకృష్ణలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

- టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నం
- చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు
(టెక్కలి/టెక్కలి రూరల్)
టెక్కలిలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. బుధవారం ఉదయం రోటరీనగర్-3లోని టీడీపీ కార్యాలయంపై దాడికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మెరైన్ సీఐ దేముళ్ళు, టెక్కలి ఎస్‌ఐలు కామేశ్వరరావు, రామకృష్ణలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ ఆర్.నీలయ్య సంఘటన స్థలానికి చేరుకుని వైసీపీ శ్రేణుల వద్ద ఉన్న పార్టీ జెండాలు, చంద్రబాబు దిష్టిబొమ్మను తీసుకున్నారు. వారిని మందలించి పంపించేశారు. అయినా వైసీపీ శ్రేణులు మరోసారి పట్టణంలో ర్యాలీ చేపట్టి టీడీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ చుక్క గున్నమ్మతో పాటు మరికొందరు ముఖ్యనాయకులు చంద్రబాబు ఫ్లెక్సీని దహనం చేశారు. బంద్‌కు సన్నద్ధమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
టీడీపీ నాయకుల బైఠాయింపు
అధిష్టానం పిలుప ుమేరకు టీడీపీ నాయకులు బుధవారం ఉదయం బంద్‌కు సన్నద్ధమయ్యారు. టెక్కలి, నందిగాం మండలాల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్, మామిడి రాము, లవకుమార్ తదితరులు బంద్‌కు సన్నద్ధమవ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. స్టేషన్‌లోనే టీడీపీ నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ గ్యారేజీ ఎదుట టీడీపీ నాయకులు మల్లా బాలకృష్ణ, మట్ట పురుషోత్తం, పోలాకి చంద్రశేఖర్ తదితరులు ఆందోళన చేయగా.. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పుక్కళ్ళ శ్రీనివాస్, చాపర గణపతి, హనుమంతు రామకృష్ణ, కర్రి విష్ణు, అప్పిని వెంకటేష్ తదితరులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కొడాలి జంక్షన్‌కు చేరుకున్నారు. పోలీసులు మరోసారి వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ శ్రేణులకు ఒక రూలు, మాకు ఒక రూలా? అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. మొత్తంగా టీడీపీ శ్రేణులను సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాస ప్రాంతంతో పాటు వివిధ కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అపశ్రుతి
కాశీబుగ్గలో వైసీపీకి కార్యకర్తకు గాయాలు
కాశీబుగ్గ: కాశీబుగ్గలో దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా.. అపశ్రుతి చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తకు నిప్పంటుకోవడంతో గాయాలయ్యాయి. సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యాలను ఖండిస్తూ కాశీబుగ్గ బస్టాప్ వద్ద వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నాయకుడు పట్టాబి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి వైసీపీ కార్యకర్త బొంపల్లి శ్రీను పెట్రోల్‌ను తీసుకువచ్చాడు. దిష్టిబొమ్మలపై పెట్రోల్ వేసి తగలబెట్టే సమయంలో ఒక్కసారిగా ఆ కార్యకర్త చేతికి, తల వెంట్రుకలకు నిప్పంటుకోవడంతో గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు మంటలను అదుపు చేశారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.