ఆర్థిక సాయం.. స‘శేష’ం!

ABN , First Publish Date - 2021-05-14T04:38:15+05:30 IST

జిల్లావ్యాప్తంగా 400 మంది పదవీ విరమణ పొందిన వారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితం హాయిగా గడపాల్సిన తరుణంలో పీఎఫ్‌, గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ కోసం నెలల తరబడి కార్యాయాల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయబద్ధంగా వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం సకాలంలో అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థిక సాయం.. స‘శేష’ం!

పదవీ విరమణ పొందిన వారికి అందని ఆర్థిక ప్రయోజనాలు

ఎనిమిది నెలలుగా పీఎఫ్‌, గ్రాట్యుటీకి దూరం

(మెళియాపుట్టి)

- మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసిన బోగి జయలక్ష్మి ఈ ఏడాది జనవరి 31న పదవీ విరమణ పొందారు. మూడు నెలలు గడుస్తున్నా పీఎఫ్‌, గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ ఇంతవరకూ ఆమెకు అందలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందక ఇబ్బందులు పడుతున్నారు.  

- పెద్దమడి ఆశ్రమ పాఠశాలలో కుక్‌గా పనిచేస్తున్న సవర పోలయ్య గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందారు. ఆయనకు కూడా ఇంతవరకూ రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ అందలేదు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ కష్టాలు ఎదుర్కొంటూ ఆయన కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 

... ఇలా జిల్లావ్యాప్తంగా 400 మంది పదవీ విరమణ పొందిన వారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితం హాయిగా గడపాల్సిన తరుణంలో పీఎఫ్‌, గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ కోసం నెలల తరబడి కార్యాయాల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయబద్ధంగా వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం సకాలంలో అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ విరమణకు మూడు నెలల ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులు బిల్లులు సమర్పించేవారు. ఉద్యోగ విరమణ అనంతరం కొద్దిరోజులకే పీఎఫ్‌, గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ వారి ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలల తరబడి సాయం అందకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పదవీ విరమణ పొందినవారికి సకాలంలో ఆర్థిక సాయం అందించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. 


పోరాటం చేస్తున్నా..

కొన్నేళ్లుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పట్టారు. ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందించాలని కోరుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు.  సర్వీసులో ఉన్నంత కాలం పీఆర్సీ, డీఏల కోసం ఎదురుచూపు తప్పడం లేదు. సీపీఎస్‌ రద్దుచేయాలని కోరినా ఫలితం లేకపోయింది. సాధారణంగా ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందితే రూ.5లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ పీఎఫ్‌, రూ.12 లక్షల వరకూ గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ కింద రూ.13 లక్షల వరకూ వస్తుంది. వేతనాన్ని బట్టి గరిష్టంగా సుమారు రూ.25 లక్షల వరకూ ఆర్థిక ప్రయోజనం అందుతుంది. వాస్తవానికి మూడు నెలల ముందే తమకు రావాల్సిన బిల్లులను ట్రెజరీల వద్ద క్లియర్‌ చేసుకుంటారు. కానీ కొన్ని నెలలుగా సీఎఫ్‌ఎంఎస్‌ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. చెల్లింపులపై ఆ ప్రభావం పడుతోంది. ఏపీజీఎల్‌ సైతం అందకపోవడంతో పదవీ విరమణ పొందిన వారిలో అందోళన నెలకొంది. 


ప్రభుత్వం స్పందించాలి

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సకాలంలో ఆర్థిక ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు సమర్పించినా సీఎఫ్‌ఎంఎస్‌ వద్ద పెండింగ్‌ పెడుతున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య పోరాటానికి దిగుతాం. 

- కోత ధర్మారావు, డీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు

Updated Date - 2021-05-14T04:38:15+05:30 IST