తెల్లారిన బతుకులు!

ABN , First Publish Date - 2021-09-04T04:46:57+05:30 IST

తెల్లారిన బతుకులు!

తెల్లారిన బతుకులు!
సంఘటన స్థలాన్ని పరిశీస్తున్న సీఐ, ఎస్‌ఐలు..... ప్రకాష్‌, లక్ష్మణరావు మృతదేహాలు

- గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి

- మరొకరికి తీవ్రగాయాలు

- పెద్దలవునిపల్లి వద్ద ఘటన

- చిన్నబడాంలో విషాదఛాయలు 

పెద్దలవునిపల్లి(నందిగాం), సెప్టెంబరు 3: సంచార జీవనం సాగిస్తున్న వారి బతుకులు.. అర్థాంతరంగా తెల్లారిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నందిగాం మండలం పెద్దలవునిపల్లి ఈ ఘటన చోటుచేసుకోగా, చిన్నబడాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ పరిధిలోని చిన్నబడాం ప్రాంతంలో నివశిస్తున్న మజ్జి లక్ష్మణరావు(36), గేదెల ప్రకాష్‌(33)లు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.  ఇదే ప్రాంతానికి చెందిన కోతి శ్రీనివాసరావు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. వీరు ముగ్గురు శుక్రవారం తెల్లవారుజామున నందిగాం నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పెద్దలవునిపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రకాష్‌, శ్రీనివాసరావులను హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్‌ సీఐ డి.రాము, ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే పోలీసులు సైతం అక్కడకు చేరుకొని క్షతగాత్రులకు సపర్యలు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. ఇదిలా ఉండగా, లక్ష్మణరావు స్వగ్రామం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా. ప్రకాష్‌ది కంచిలి మండలం రావుపురం. శ్రీనివాసరావుది పలాస మండలం సూదికొండ. వీరు ముగ్గురూ పలాసలోని చిన్నబడాం ప్రాంతంలో కుటుంబాలతో సంచార జీవులుగా నివసిస్తున్నారు. పక్షులు, కుందేళ్లు, తదితర ప్రాణులను వేటాడుతూ.. జీవనం సాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

 

Updated Date - 2021-09-04T04:46:57+05:30 IST