హతవిధీ!

ABN , First Publish Date - 2021-12-28T05:39:24+05:30 IST

హతవిధీ!

హతవిధీ!
పీబీ నగర్‌ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జయిన ద్విచక్రవాహనాలు , అప్పలనాయుడు (ఫైల్‌ )నాగరాజు (ఫైల్‌)

- వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

- పెళ్లయిన నెల రోజుల్లోనే యువకుడు దుర్మరణం

- శుభకార్యానికి వెళ్తూ మరొకరు...

- మురపాక, పోతాయవలసల్లో విషాదం

లావేరు, డిసెంబరు 27 : విధి వారిపై చిన్న చూపు చూసింది. ఊహించని విధంగా మృత్యువు కబళించింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదం నింపింది. వివాహమై నెలరోజులు గడవకుండానే ఓ యువకుడు, విజయవాడలో ఓ శుభకార్యానికి బయలుదేరిన మరో యువకుడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. దీంతో ఆయా స్వగ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

వివరాల్లోకి వెళ్తే.... మురపాక గ్రామానికి చెందిన గొర్లె అప్పలనాయుడు (32) ఆదివారం రాత్రి బైక్‌పై చిలకపాలెం వెళ్లి తిరిగొస్తుండగా పీబీ నగర్‌ కాలనీ వద్ద అల్లినగరం వైపు వెళ్తున్న మరో బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డా డు. స్థానికుల సహకారంతో ఆయన్ని 108 వాహనంలో  శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అప్పలనాయుడుకి ఈ నెల 8న ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లై నెల రోజులు కూడా గడవక ముందే అప్పల నాయుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ నవ వధువు వేదన వర్ణణాతీతం. కంచిలి మండలం పెసరపాడు సచివాలయంలో పశువైద్య సహాయకుడిగా  పనిచేస్తున్న అప్పలనాయుడుకు తల్లిదండ్రులు లక్ష్ము ము, సీతమ్మ, సోదరుడు రాంబాబు ఉన్నారు. అందరితో సరదాగా ఉండే యువకుడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మురపాక గ్రామంలో విషా దచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎస్‌ఐ సిద్ధార్థ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


శుభ కార్యానికి వెళ్తూ...

విజయవాడలోని తన బంధువుల ఇంట్లో  శుభకార్యానికి వెళ్లేందుకు ఇదే మండలం పోతాయవలసకు చెందిన అగత నాగరాజు (22) శనివారం రాత్రి బయల్దేరాడు. అప్పాపురంలోని తన స్నేహితులతో కలిసి అదే గ్రామ జంక్షన్‌కు చేరుకున్నాడు. తొలుత ఆటోలో సుభద్రాపురం సెంటర్‌కు వెళ్తేందుకు సిద్ధమవ్వగా... ఇంతలో చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు వచ్చింది. ఈ క్రమంలో బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా ఓ బైక్‌ వేగంగా వచ్చి నాగరాజును ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. నాగరాజుకు తల్లిదండ్రులు నర్సింగరావు, దమయంతి ఉన్నారు. ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసిన ఆ యువకుడి ఆకస్మిక మృతితో పోతాయవలస వాసులు, కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘనటపై లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-28T05:39:24+05:30 IST