చదివింది ఇంటరే కానీ..!

ABN , First Publish Date - 2021-11-27T04:58:50+05:30 IST

చదివింది ఇంటర్‌... కానీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఉన్న తెలివితేటలు ఆ కుర్రాడి సొంతం. అత్యాశకు పోయి ఆ తెలివితేటలను అక్రమ సంపాదనకు వినియోగించాడు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ప్రజల నుంచి నగదు వసూలు చేసి బురిడీ కొట్టించాడు. కోట్లాది రూపాయలతో ఉడాయించాడు ఇవీ ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన మడ్డి నాగేశ్వరరావు (నగేష్‌) లీలలు. ఇవి ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి.

చదివింది ఇంటరే కానీ..!
ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ వద్ద బాధితులు

సాఫ్ట్‌వేర్‌ నిపుణుడి తెలివితేటలు

ప్రత్యేక యాప్‌లతో బురిడీ

వెలుగుచూస్తున్న నగేష్‌ లీలలు

పోలీసులను ఆశ్రయిస్తున్న వందలాది మంది బాధితులు

ఎచ్చెర్ల, నవంబరు 26: చదివింది ఇంటర్‌... కానీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఉన్న తెలివితేటలు ఆ కుర్రాడి సొంతం. అత్యాశకు పోయి ఆ తెలివితేటలను అక్రమ సంపాదనకు వినియోగించాడు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ప్రజల నుంచి నగదు వసూలు చేసి బురిడీ కొట్టించాడు. కోట్లాది రూపాయలతో ఉడాయించాడు ఇవీ ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన మడ్డి నాగేశ్వరరావు (నగేష్‌) లీలలు. ఇవి ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. ఎచ్చెర్లలో కంప్యూటర్‌ సెంటర్‌ కేంద్రంగా పాల్పడిన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డిపాజిట్లపై నెలనెలా వడ్డీ పొందండి అంటూ ప్రచారం చేయడంతో చాలామంది ఆయన వలలో పడ్డారు. ప్రత్యక్షంగా వందలాది మంది... పరోక్షంగా వేలాది మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది వేరొక వ్యక్తుల నుంచి అప్పుగా తీసుకొని పెట్టుబడి పెట్టి నిండా మునిగారు. మరికొంతమంది ఇళ్లను తాకట్టుపెట్టి డిపాజిట్‌ చేశారు. ఈ మోసం వెనుక నగేష్‌ ఒక్కడే ఉన్నాడా? ఎవరి సహకారమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన గురించి నివ్వెరపరిచే నిజాలు తెలుస్తున్నాయి. నగేష్‌ చాలా ఏళ్ల కిందట గ్రామంలో చిట్టీలు వేసి ఐపీ పెట్టి చేతులెత్తేశాడు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌లో ఉన్నాడు. అక్కడే సాఫ్ట్‌వేర్‌పై పట్టు సాధించాడు. కొద్ది కాలంలోనే కోట్లకు పడగెత్తాలని అనుకున్నాడేమో... హండర్‌ క్యాప్చీ యాప్‌ను రూపొందించాడు. ముందుచూపుతో ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా డబ్బులు వసూలు చేసేవాడు. తిరిగి చెల్లించేటపుడు తన అకౌంట్‌తో కాకుండా వేరొకరి బ్యాంకు అకౌంట్ల ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసేవాడు. తన అకౌంట్‌లోని మొత్తాన్ని నేరుగా క్లయింట్‌కు కాకుండా... వేరొక వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్‌ చేసి అక్కడి నుంచి అసలు క్లయింట్‌కు బదిలీ చేసేవాడని తెలుస్తోంది. తన చేతికి మట్టి అంటకుండానే భారీగా నిధులను స్వాహా చేసినట్టు ఫిర్యాదు అందుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్న వారు... ఉద్యోగులు, వ్యాపారులే ఉండడం విశేషం. ఎచ్చెర్లలో తాను నడిపిన కంప్యూటర్‌ సెంటర్‌లో కొంతమంది సిబ్బందిని నియమించి... ఈ పనులకు పురమాయించాడు. 

వేర్వేరు పేర్లతో

మడ్డి నాగేశ్వరరావు అనే ఈ వ్యక్తి ఎవరికీ అనుమానం రాకుండా ఎంవీఆర్‌ ప్రాజెక్ట్స్‌, ధనుష్‌ (తన కుమారుని పేరుతో) యాప్‌లను తయారుచేసినట్టు చెబుతున్నారు. గూగుల్‌ సెర్చ్‌ చేస్తే ఇదే పేర్లతో యాప్‌లు ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదని అంటున్నారు. మేనేజర్‌ ప్రాజెక్ట్‌, 8 ఆర్‌ఎస్‌ క్యాప్చా, 4 ఆర్‌ఎస్‌ క్యాప్చా, షేర్‌ ఫ్రైజ్‌ ఇలా పేర్లు పెట్టి ఆన్‌లైన్‌లో డిపాజిట్లు వసూలు చేశాడు. ఒక స్లాట్‌ తీసుకుంటే 300 ఐడీలు ఇచ్చేవాడని.. ఒక్కో ఐడీకి రూ.650వంతున చెల్లిస్తే రూ.1300 తిరిగి చెల్లించేవాడని చెబుతున్నారు. రూ.1.95 లక్షలు చెల్లిస్తే రూ.3.9 లక్షలు తిరిగి చెల్లిస్తానని ప్రచారం చేసేవాడు. చిన్న చిన్న మొత్తాలను మొదట్లో చెల్లించి, ఆ తర్వాత పెద్ద మొత్తాలు చెల్లించాల్సి వచ్చేసరికి కనిపించకుండా పోయాడు. ఘరానా మోసం వెలుగు చూడడంతో బాధితులు ఎచ్చెర్ల పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎస్‌ఎంపురంతో పాటు, శ్రీముఖలింగం, కొమనాపల్లి, కత్తెరవానిపేట, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బాధితులుగా ఉన్నారు. ద్వారకామాయి అనే వ్యక్తి ఏకంగా కోటి రూపాయల పైనే మోసపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య రూ.80 లక్షలు, తేజ రూ.40 లక్షలు, పూర్ణచంద్రరావు రూ.60 లక్షలు, ప్రతాప్‌ రూ.7 లక్షలు, అజయ్‌కుమార్‌ రూ.19 లక్షలు, నర్సింగ్‌ రూ.3.2 లక్షలు, శ్రీను రూ.3 లక్షలు ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.Updated Date - 2021-11-27T04:58:50+05:30 IST