వ్యాన్‌ ఢీకొని నారువ వాసి...

ABN , First Publish Date - 2021-12-28T05:35:51+05:30 IST

వ్యాన్‌ ఢీకొని నారువ వాసి...

వ్యాన్‌ ఢీకొని నారువ వాసి...
రోడ్డు ప్రమాదంలో మరణించిన గౌరి మృత దేహం

- నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

- విజయనగరం జిల్లా నాతవలస వద్ద ఘటన

డెంకాడ, డిసెంబరు 27 : విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస బ్రిడ్జిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన ఎన్‌.గౌరి (30) మరణించాడు. అతన్ని ఢీకొన్న వ్యాన్‌ డ్రైవర్‌ తప్పించుకుని పరారవుతుండగా పోలీసులు అప్రమత్తమై ఆటోడ్రైవర్ల సాయంతో పట్టుకున్నారు. డెంకాడ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

గౌరి ద్విచక్ర వాహనంపై నారువ గ్రామం నుంచి విజయనగరం వెళ్తున్నాడు. నాతవలస బ్రిడ్జిపైకి వచ్చే సరికి రాంగ్‌రూట్‌లో వచ్చిన వ్యాన్‌ అతన్ని బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన గౌరి ఘటన స్థలంలోనే మరణించాడు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న కొందరు చూసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వ్యాన్‌ దూరంగా వెళ్లి పోయింది. ఆ వ్యాన్‌ ఆనవాళ్లు గుర్తుంచుకుని డెంకాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ పద్మావతి వివరాలు తెలుసుకుని పూసపాటిరేగ ఎస్‌ఐ జయంతికి సమాచారం ఇచ్చారు. ఈమె కూడా వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లకు ఫోన్‌ చేసి వ్యాన్‌ ఆనవాళ్లు వివరించి అడ్డుకోవాలని కోరారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు కలిసి అటుగా వస్తున్న వ్యాన్‌ను గమనించి అనుమానంతో అడ్డుకున్నారు. మూడు ఆటోలను రోడ్డుపై అడ్డుగా ఏర్పాటు చేసి వ్యాన్‌ను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వ్యాన్‌ను స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లను ఎస్‌ఐ అభినందించారు. గౌరి మృతదేహాన్ని జిల్లా కేంద్రాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-12-28T05:35:51+05:30 IST