వ్యాక్సిన్‌ లక్ష్యం...ఇంకా దూరం

ABN , First Publish Date - 2021-10-29T04:43:40+05:30 IST

వ్యాక్సిన్‌ లక్ష్యం...ఇంకా దూరం

వ్యాక్సిన్‌ లక్ష్యం...ఇంకా దూరం
ఆదివారంపేట సచివాలయంలో ఖాళీగా ఉన్న వ్యాక్సినేషన్‌ కేంద్రం

- భయంతో అనేక మంది వెనుకడుగు

- ఇంకా 2.50 లక్షల మందికి అందని వైనం

- అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలం

(శ్రీకాకుళం- ఆంధ్రజ్యోతి)

ఓవైపు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలలో భారీ క్యూలు... వ్యాక్సిన్‌ కోసం ప్రముఖుల సిఫారసులు... సరిపడే నిల్వలు లేక వాయిదాలు... మరోవైపు ఇప్పటికీ వేలాది మందికి వివిధ రకాల భయాలు... అపోహలు... అవగాహన లేమితో వ్యాక్సిన్‌ కేంద్రాల వైపు రావడానికే ఇష్టపడని వైనం.. ఇదీ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పరిస్థితి. ఫలితంగా శతశాతం లక్ష్యసాధనలో జిల్లా యంత్రాంగం వెనుకబడింది. దీంతో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం 90 శాతం మాత్రమే వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను చేరుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కొందరు వృద్ధులు ముందుకు రాకపోవడంతో శతశాతం లక్ష్యాన్ని సాధించలేకపోయామని చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి 16న తొలిసారిగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. దశల వారీగా జిల్లావ్యాప్తంగా విస్తరించారు. దాదాపు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో కలిపి మొత్తం 104 కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు. మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఊపిరిత్తుల వ్యాధులతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అనేకమంది వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు ఆసక్తి చూపడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు కొందరు వృద్ధులు కూడా ఇంకా వ్యాక్సిన్‌ వేసుకొనేందుకు జంకుతున్నట్లు సమాచారం. దీంతో అందరికీ వ్యాక్సినేషన్‌ అనే లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నారు. 


అవగాహన లేకనే...

జిల్లాలో 18 ఏళ్ల లోపు పిల్లలు మినహా దాదాపు అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని నిర్ణయించారు. సుమారు 25 లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలని ప్రతిపాదించారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 22.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయగలిగారు. కొవాగ్జిన్‌ 2,92,950 మందికి... కొవిషీల్డ్‌ 19,57,250 మందికి వేశారు. వీటితో పాటు స్పుత్నిక్‌-వి మొదటి డోసు 9,483 మందికి, రెండో డోసు 8,963 మందికి వేశారు. ఇంకా సుమారు 2.50 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదని సమాచారం. వార్డు వలంటీర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది సర్వే ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు జరిగిన వారు, డయాలిసిస్‌ రోగులు, వృద్ధులు వ్యాక్సినేషన్‌కు దూరమైనట్లు గుర్తించారు. వాస్తవానికి కరోనా వైరస్‌ దీర్ఘకాలిక వ్యాధిగస్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కరోనా వైరస్‌ బారిన పడితే... ప్రాణాపాయ పరిస్థితుల వరకు వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన కొవిడ్‌ మరణాల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయినా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడంలేదు. వాస్తవానికి వ్యాక్సిన్‌ వేసుకొని... గతంలో ఉన్న వ్యాధులకు సంబంధించిన మందులను యథావిధిగా కొనసాగించవచ్చని వైద్య నిపుణలు సూచిస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పెద్దగా ఛైతన్యం రాకపోవడంతో ఇలాంటి బాధితులు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.


సమస్య ఉండదు 

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. వారికి ఎటువంటి సమస్య ఉండదు. కొందరు  అనవసరంగా భయపడుతున్నారు. జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత లేదు. ఎటువంటి వ్యాధులు ఉన్నవారైనా.. వైద్యుల సూచనలు తీసుకొని కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు. ఇంకా వ్యాక్సిన్‌ వేయించుకోని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- డాక్టర్‌ బగాది జగన్నాథరావు, ఏడీఎంహెచ్‌ఓ, శ్రీకాకుళం

Updated Date - 2021-10-29T04:43:40+05:30 IST