వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం

ABN , First Publish Date - 2021-12-31T05:42:40+05:30 IST

‘ఎన్టీఆర్‌పై ప్రమాణం చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంద’ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అధ్యక్షతన టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం
కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు




ప్రతి కార్యకర్తనూ ఆదుకుంటాం

జిల్లాకు డిప్యూటీ సీఎం, స్పీకర్‌ తీసుకొచ్చిందేమిటి?

రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ఓటీఎస్‌పై నిరసన

భారీగా హాజరైన శ్రేణులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 30: ‘ఎన్టీఆర్‌పై ప్రమాణం చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంద’ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అధ్యక్షతన టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే రక్ష అని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకూ అండగా నిలబడతామని చెప్పారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఒక్క ఇంటినైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. అటువంటప్పుడు ఓటీఎస్‌ ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ రెండున్నరేళ్ల కాలంలో జిల్లాకు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఏ సమయంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశముందన్నారు. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్లమెంట్‌ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు టీడీపీయే దక్కించుకోవాలన్నారు. ఇందుకు కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల  నియమితులైన తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర కమిటీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష,  మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

రూ.57 వేల కోట్లు దండుకునేందుకే..

ఓటీఎస్‌ పేరుతో రూ.57 వేల కోట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ నాయకులు, శ్రేణులు భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మెయిన్‌ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొంతమందినే విడిచిపెడతామని చెప్పడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే కొద్దిసేపు బైఠాయించారు. కలెక్టర్‌ లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి వచ్చి వినతిపత్రం స్వీకరించారు. 



Updated Date - 2021-12-31T05:42:40+05:30 IST