శివ నామస్మరణం.. పులకించిన భక్తజనం

ABN , First Publish Date - 2021-03-15T05:06:42+05:30 IST

శివనామ స్మరణతో వంశధార నదీ తీరం మార్మోగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి దృష్ట్యా సుదూర ప్రాంతాల నుంచి భక్తుల రాకను నిషేధించారు. పరిసర గ్రామాల భక్తులకే పరిమితం చేశారు. ఏటా శ్రీముఖలింగంలో శివరాత్రి వేడుకలు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి రోజు చక్రతీర్థ స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను బయటకు తెచ్చి నంది వాహనంపై ఉంచారు. అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వంశధార నదిలోని మిరియాపల్లి తీరానికి తీసుకెళ్లారు. అప్పటికే వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు.

శివ నామస్మరణం.. పులకించిన భక్తజనం
పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను చక్రతీర్థ స్నానాలకు తీసుకెళ్తున్న భక్తులు

 నిరాడంబరంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం

 కొవిడ్‌ ఆంక్షల నడుమ వేడుకలు 

 స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి హాజరైన భక్తులు

జలుమూరు/ఎల్‌ఎన్‌పేట, మార్చి 14: శివనామ స్మరణతో వంశధార నదీ తీరం మార్మోగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి దృష్ట్యా సుదూర ప్రాంతాల నుంచి భక్తుల రాకను నిషేధించారు. పరిసర గ్రామాల భక్తులకే పరిమితం చేశారు. ఏటా శ్రీముఖలింగంలో శివరాత్రి వేడుకలు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి రోజు చక్రతీర్థ స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం ఉదయం  ఆరు గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను బయటకు తెచ్చి నంది వాహనంపై ఉంచారు. అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వంశధార నదిలోని మిరియాపల్లి తీరానికి తీసుకెళ్లారు. అప్పటికే వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇటు జలుమూరు, అటు ఎల్‌ఎన్‌పేట మండలాల పరిధిలోని నదీ పరీవాహక గ్రామాల మీదుగా కాలినడకన ఎక్కువ మంది భక్తులు చక్రతీర్థ స్నానాలకు చేరుకున్నారు. ఏటా మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ స్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చాలామంది భక్తులు మధ్యాహ్నం దాటిన తరువాతే కార్యక్రమం నిర్వహణ ఉంటుందని భావించారు. ఉదయం ఏడు గంటలకే స్వామివారి చక్రతీర్థ స్నానం పూర్తికావడం, ఎనిమిది గంటలకు ఉత్సవమూర్తులను తిరిగి యథాస్థానాల్లో చేర్చడంతో నిరుత్సాహానికి గురయ్యారు. గొట్టా బ్యారేజీ వద్ద గేట్లు మూసివేయడంతో నదిలో అంతంతమాత్రంగానే నీరు ఉంది. వాస్తవానికి మిరియాపల్లి తీరంలో పందిరి కింద సంప్రదాయం ప్రకారం పూజలు చేసి చక్రతీర్థ స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి నది మధ్యలో పందిరి వేసి పూజలు స్వల్పకాలంతో ముగించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


వాహనాల నిలిపివేత


శ్రీముఖలింగంలో శివరాత్రి వేడుకలు నిషేధించడం, చక్రతీర్థ స్నానాలను స్థానిక భక్తులతోనే పూర్తిచేయాలన్న కలెక్టర్‌ ఆదేశాలతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 5 గంటలకే శ్రీముఖలింగం వచ్చే మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. బుడితి, కొమనాపల్లి, అచ్చుతాపురం, నగరికటకం వద్ద వాహనాలను నిలిపివేశారు. అయినా చాలా మంది కాలినడకన శ్రీముఖలింగం చేరుకున్నారు. ముందస్తు ఆంక్షలతో భక్తులు తగ్గుముఖం పట్టినా...మధ్యాహ్నం 11 గంటల తరువాత ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది. దేవదాయ శాఖ సూపరెంటెండెంట్‌ ఎం.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ జి.ప్రసాద్‌బాబు, పలాస ఈవో పి.ప్రభాకరరావు, డిప్యూటీ తహసీల్దారు పి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర, సీ.ఐ తిరుపతిరావు, ఎస్‌ఐ వై.కృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. పరిసర గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శిబిరాలు ఏర్పాటు చేశారు. భోజనాలతో పాటు ప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందించారు.

Updated Date - 2021-03-15T05:06:42+05:30 IST