క్రీడ... నిర్లక్ష్యపు నీడ!

ABN , First Publish Date - 2021-10-30T03:53:41+05:30 IST

క్రీడ... నిర్లక్ష్యపు నీడ!

క్రీడ... నిర్లక్ష్యపు నీడ!
పాత్రునివలసలో అర్థాంతరంగా నిలిచిన క్రీడా భవనం

- ఏళ్ల తరబడి సాగుతున్న స్టేడియాల పనులు

- పైసా విదల్చని వైసీపీ ప్రభుత్వం

- క్రీడాకారుల్లో నిరాశ

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లయిన సిక్కోలులో క్రీడా ప్రగతిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ‘క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామ’ని ఎప్పటికప్పుడు చెప్పుకునే నాయకులు... ముఖ్యంగా మన జిల్లా నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.  క్రీడా మైదానాలు... స్టేడియంల నిర్మాణం... అభివృద్ధిపై నేతలెవరూ దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా సరైన ప్రోత్సాహం... వసతులు లేక క్రీడాకారులు డీలా పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్కటి రూ.2 కోట్ల అంచనా వ్యయంతో మినీ స్టేడియంలను నిర్మించ తలపెట్టింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు నిధులు కేటాయించింది.కానీ పనులు కదలలేదు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు హయాంలో జిల్లాలో స్టేడియాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండో దశ పనుల కింద రణస్థలం, రాజాం, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేటల్లో స్టేడియాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఒక్కొక్క దానికి రూ.2.10 కోట్ల వంతున కేటాయిస్తూ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. వీటిలో రణస్థలం, ఆమదాలవలసలో స్టేడియం పనులు పూర్తయ్యాయి. ఆమదాలవలస స్టేడియాన్ని ఏపీ క్రికెట్‌ అసోషియేషన్‌కు అప్పగించారు. స్టేడియంలలో ప్లేఫీల్డ్‌, ఒక భవనం, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, కోకో, బ్యాడ్మింటన్‌ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధులు సరిపోకపోవడంతో ఆమదాలవలస, రణస్థలం మినహా మిగిలిన 7 చోట్ల ఎక్కడి పనులు అక్కడే అన్న తీరున ఉండిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని పూర్తి చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు గుప్పించినా..నేటికీ కార్యరూపం దాల్చలేదు. 

-  రాజాంలో క్రీడా భవనం పనులు శ్లాబ్‌ దశలో నిలిచిపోయాయి. 

- ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేటల్లో పునాదుల స్థాయిలోనే పనులు ఆగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీటికి ఒక్క పైసా కూడా చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయలేమని చేతులెత్తేసినట్లు తెలిసింది. ఈ విషయంపై అనేకసార్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ప్రభుత్వానికి, నాయకులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. స్థానిక ఎమ్మెల్యేలు పట్టనట్లు వదిలేయడంపై క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మల్టీపర్పస్‌ కాంప్లెక్స్‌ ఎక్కడ?

శ్రీకాకుళంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. నగరానికి ఆనుకొని ఉన్న పాత్రునివలసలో అప్పట్లో 33 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వం క్రీడా స్థలం అభివృద్ధికి రూ.50 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ రూపొందించింది. దీనికి పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఈ స్థలానికి చుట్టూ రూ.1.50 కోట్లతో రక్షణ గోడ నిర్మించి.. పనులు మధ్యలోనే వదిలేశారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.6 కోట్లు కేటాయించినా... పనులు ముందుకు కదలలేదు.


కోడిరామ్మూర్తి స్టేడియమూ అంతే...

శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి క్రీడా ప్రాంగణం అభివృద్ధికి విశాఖ వీఎంఆర్‌డీఏ నిధులు రూ.7.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. పనులు ప్రారంభించేలోగా సుడా పరిధిలో ఉన్న ఈ స్టేడియానికి వీఎంఆర్‌డీఏ నిధులు ఇవ్వకూడదనే నిబంధన తెరపైకి వచ్చింది. దీంతో ఇది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ నిధులు ఎక్కడున్నాయో పట్టించుకొనే వారే కరువయ్యారు. ఇక 2017లో శాంతినగర్‌ కాలనీలో 1.17 సెంట్ల స్థలంలో క్రీడా మైదా నాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనికి కొవ్వాడ అణువిద్యుత్‌ సంస్థ నిధులు కేటాయించింది. వివిధ క్రీడాకోర్టులను నిర్మించ తలపెట్టినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఆ ప్రతిపాదన ఏమైందో పాలకులకే తెలియని పరిస్థితి. 


పూర్తి చేయాలని కోరాం

జిల్లాలో స్టేడియంల పనులు నిలిచిపోయిన మాట వాస్తవమే. ఇప్పటికే ప్రారంభించి... మధ్యలో నిలిపివేసిన పనులను పూర్తి చేయాలని జిల్లా అధికారులకు విన్నవించాం. స్టేడియంలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో మరింతమంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది.

- బి.శ్రీనివాస్‌ కుమార్‌, చీఫ్‌ కోచ్‌, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి

Updated Date - 2021-10-30T03:53:41+05:30 IST