ఉండాల్సింది 540 మంది.. ఉన్నది 116 మంది!

ABN , First Publish Date - 2021-12-26T05:03:12+05:30 IST

జిల్లాలో అన్ని కాలేజీల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ప్రభావం బోధనపై పడుతోంది. గత కొన్నేళ్లుగా కొత్తగా అధ్యాపకుల నియామక ప్రక్రియ చేపట్టడం లేదు. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను కూడా భర్తీ చేయడం లేదు. జిల్లాలో కేవలం 116 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు అన్ని కాలేజీల్లో కాంట్రాక్ట్‌ అధ్యాపకులే దిక్కవుతున్నారు.

ఉండాల్సింది 540 మంది..  ఉన్నది 116 మంది!
టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల.

ప్రభుత్వ కాలేజీల్లో రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత

కొన్నేళ్లుగా నూతన నియామకాలు లేవు

కాంట్రాక్ట్‌ లెక్చరర్లే దిక్కు

నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌దీ అదే పరిస్థితి

సక్రమంగా సాగని బోధన

ఆందోళనలో విద్యార్థులు

(రాజాం)

 - రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 308 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఒక ప్రిన్సిపాల్‌, ఇద్దరు కాంట్రాక్ట్‌ అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. దీంతో సరిగ్గా విద్యాబోధన జరగడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

- జి.సిగడాం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ వందలాది మంది విద్యార్థులకుగాను బోధిస్తున్నది ముగ్గురే. ఇక్కడ ఒక ప్రిన్సిపాల్‌, ఇద్దరు కాంట్రాక్ట్‌ అధ్యాపకులే ఉన్నారు. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కూడా తగినంత మంది లేరు. దీంతో కాలేజీ నిర్వహణ కష్టతరంగా మారుతోంది. 

- ఈ పరిస్థితి ఈ రెండు కాలేజీలదే కాదు. దాదాపు జిల్లాలో అన్ని కాలేజీల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ప్రభావం బోధనపై పడుతోంది. గత కొన్నేళ్లుగా కొత్తగా అధ్యాపకుల నియామక ప్రక్రియ చేపట్టడం లేదు. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను కూడా భర్తీ చేయడం లేదు. జిల్లాలో కేవలం 116 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు అన్ని కాలేజీల్లో కాంట్రాక్ట్‌ అధ్యాపకులే దిక్కవుతున్నారు. జిల్లాలో 46 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 9,200 మంది చదువుతున్నారు. కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీతో పాటు వృత్తి విద్యా కోర్సులు కొనసాగుతున్నాయి. ఒక్కో కాలేజీలో ప్రిన్సిపాల్‌తో పాటు మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, బయాలజీ, హిస్టరీ, సివిక్స్‌, కామర్స్‌, ఇంగ్లీష్‌, తెలుగు తదితర 11 మంది అధ్యాపకులు ఉండాలి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో 540 మంది ఉండాలి. కానీ కేవలం 116 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. ప్రస్తుతం 384 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పని చేస్తున్నారు. మరో 86 ఖాళీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అన్ని కాలేజీల్లో సమాన ప్రాతిపదికన కాంట్రాక్ట్‌ అధ్యాపకులు లేరు. కొన్ని కాలేజీల్లో పూర్తిగాను.. మరికొన్ని చోట్ల ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. పబ్లిక్‌ పరీక్షల సమయం దగ్గర పడుతోంది. మరోవైపు అధ్యాపకులు లేక సిలబస్‌ సకాలంలో పూర్తికావడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


అరకొరగా అధ్యాపకేతర సిబ్బంది

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు అధ్యాపకులు ఎంత ముఖ్యమో..అధ్యాపకేతర సిబ్బందీ అంతే ముఖ్యం. కానీ చాలావరకూ కాలేజీల్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అసలు లేరు. ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌, జునియర్‌ అసిస్టెంట్‌, అటెండర్లు వంటి పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. దీంతో బోధనేతర పనులు కూడా అధ్యాపకులే చూడాల్సి వస్తోంది. దీనికితోడు విద్యార్థుల్లో సేవాభావం అలవరిచే ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ వంటి విభాగాలకు సైతం అధ్యాపకులే బాధ్యత తీసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకం ఊసే ఎత్తలేదు. కాలేజీల్లో పాలనాపరమైన అన్ని అంశాలు ప్రిన్సిపాళ్లు, సీనియర్‌ అధ్యాపకులే చూస్తున్నారు.


 ఇంటర్‌ విద్యార్థులకు.. పరీక్షే!

(టెక్కలి రూరల్‌) : విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ అత్యంత కీలకమైనది. ఈ దశలో సాధించిన పరిజ్ఞానం విద్యార్థికి డిగ్రీ, పీజీతో పాటు డైట్‌, ఫార్మసీ ఇతర కోర్సులలో ఉన్నత విద్యాభ్యాసానికి కీలకమవుతుంది. కానీ, ప్రస్తుత ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షా కాలం ఎదురవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ, తరగతుల నిర్వహణ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు పరీక్షల గడువు ముంచుకొస్తున్నా.. సిలబస్‌ పూర్తికాక.. పాఠ్యాంశాలు అర్థం కాక విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి జనవరి 5 వరకు అర్థ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం ప్రాక్టికల్స్‌, వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. వార్షిక పరీక్షల తరహాలోనే అర్థ సంవత్సర పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావించారు. కానీ ఆ విధంగా ప్రణాళిక రూపొందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో సుమారు 60వేల మంది విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. ఆగస్టు 16 నుంచి ద్వితీయ సంవత్సరం, సెప్టెంబరు 28 నుంచి ప్రథమ సంవత్సరం  విద్యార్థులకు బోధన ప్రారంభించారు. అకడమిక్‌, ప్రాక్టికల్స్‌ సిలబస్‌ను 70 శాతం కుదించారు. కానీ, బోధన సక్రమంగా సాగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 60శాతం, ద్వితీయ సంవత్సరం 80శాతం సిలబస్‌ పూర్తయింది. ఈ ఏడాది సిలబస్‌ తగ్గించినా.. విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లుగా పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేసేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంటర్‌ బోధన అర్థం చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి సమయంలో పరీక్షలను ఎలా సమర్థంగా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకమవుతోంది. పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఆ ప్రభావం కూడా పరీక్షల ఫలితాలపై పడే అవకాశాలున్నాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ విషయమై ఆర్‌ఐవో తవిటినాయుడు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ‘లక్ష్యానికి అనుగుణంగా ఇంటర్‌ సిలబస్‌ పూర్తిచేశాం. అర్ధసంవత్సర పరీక్షల ఫలితాలు.. వార్షిక పరీక్షలకు ముడిపెడతారనే ప్రచారం వాస్తవం కాదు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా’మని తెలిపారు.  


ఇద్దరే అధ్యాపకులు

ఎంతో ఉత్సాహంతో ఇంటర్‌లో చేరాను. కానీ ఇక్కడ పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు కాంట్రాక్ట్‌ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. అన్ని సబ్జెక్టులకు వారే బోధిస్తున్నారు. పరీక్షలపై భయం వెంటాడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లెక్చరర్లను నియమించాలి.  

- శైలజ, విద్యార్థిని, మహిళా జూనియర్‌ కళాశాల, రాజాం


ఆందోళనగా ఉంది

మంచి బోధన అందుతుందని ఆశించి కాలేజీలో చేరాను. కానీ అధ్యాపకులు లేరు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సైతం ఇద్దరే ఉన్నారు. పరీక్షలు సమీపిస్తున్నాయి. సిలబస్‌ పూర్తికావడం లేదు. చాలా ఆందోళనగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. అధ్యాపకులను నియమించాలి. 

- యశోద, విద్యార్థిని, మహిళా జూనియర్‌ కాలేజీ, రాజాం


సిబ్బంది కొరత వాస్తవమే

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత వాస్తవమే. జిల్లాలో 46 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 116 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులతో బోధన సాగుతోంది. అయినా ఉత్తమ  ్యబోధన అందిస్తున్నాం. అధ్యాపకుల భర్తీ విషయమై ప్రభుత్వానికి నివేదించాం. 

- శివ్వాల తవిటినాయుడు, ఆర్‌ఐవో, శ్రీకాకుళం

Updated Date - 2021-12-26T05:03:12+05:30 IST