కాలువలు కబ్జా
ABN , First Publish Date - 2021-10-30T03:51:41+05:30 IST
కాలువలు కబ్జా
- నరసన్నపేటలో పెరుగుతున్న ఆక్రమణలు
- జోరుగా నిర్మాణాలు..
- పట్టించుకోని అధికారులు
(నరసన్నపేట)
భూములు ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే అక్రమార్కులు రంగంలోకి దిగిపోతున్నారు. భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. నరసన్నపేటలో కాలువలు సైతం కబ్జా చేసి.. నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది తెరవెనుక ఒప్పందాలతో యథేచ్ఛగా ‘వంశధార’ కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి.
- గొట్టిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో సుమారు 500 మీటర్ల వరకు కాలువ ఆక్రమణకు గురైంది. ఇక్కడ భారీ భవనాలు నిర్మించారు. ఈ కాలువకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గొట్టిపల్లి రెవెన్యూ రికార్డుల్లో కాలువ ఉన్నట్లు నమోదు కాలేదని, ఈ నేపథ్యంలో తామేమి చేయలేమని పేర్కొంటున్నారు. చెబుతున్నారు.
- జమ్ము జంక్షన్ సమీపంలో నరసన్నపేట మెయిన్ బ్రాంచ్ కాలువ గట్టును ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి చదును చేసి ప్లాట్లు వేశారు. దీని వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అలాగే 11 ఆర్ కిళ్లాం కాలువ గట్టుపై హడ్కోకాలనీ సమీపంలో భవనాలు నిర్మించారు.
- కరగాం గ్రామం వద్ద తురకవాని చెరువు నుంచి వచ్చే వరద నీటి కాలువను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. కంబకాయి, కరగాం గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
- 11 ఆర్ కిళ్లాం కాలువ నుంచి బొరిగివలస పొలాలకు వెళ్లే కాలువను కళాసీ కాలనీ, వీరన్నాయుడు కాలనీలో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. సత్యనారాయణ కాలనీలో కాలువలను రియల్‌ఎస్టేట్‌కు రోడ్డుగా వినియోగించారు. మారుతీనగర్, శ్రీనివాస నగర్‌లలో కాలువలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
- నరసన్నపేటలో రాజుల చెరువుకు వెళ్లే మంచినీటి కాలువను కాలేజీ రోడ్డు వద్ద ఆక్రమించి.. నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయమై వంశధార డీఈఈ మురళీమోహన్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. కాలువల ఆక్రమణల నివారణపై దృష్టి సారించామని తెలిపారు. కాలువల ఆధునికీకరణ పనుల్లో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కాలువ పక్కన ప్లాట్ల కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.