పాఠశాల బస్సే మృత్యువై..

ABN , First Publish Date - 2021-10-21T05:23:43+05:30 IST

అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బాలుడు రోజూ మాదిరిగానే ప్రైవేటు బస్సులో పాఠశాలకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ఆ బస్సు చెరువులో బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే బాలుడు దుర్మరణం పాలయ్యాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

పాఠశాల బస్సే మృత్యువై..
బోల్తాపడిన బస్సు.. మైలపల్లి రాజు (ఫైల్‌)

- బస్సు బోల్తా పడి విద్యార్థి దుర్మరణం 

- కొయ్యాం పంచాయతీలో ఘటన

- బడివానిపేటలో విషాదం

ఎచ్చెర్ల, అక్టోబరు 20: అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బాలుడు రోజూ మాదిరిగానే ప్రైవేటు బస్సులో పాఠశాలకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ఆ బస్సు చెరువులో బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే బాలుడు దుర్మరణం పాలయ్యాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే.. కొయ్యాం పంచాయతీ నిమ్మవానిపేట సమీపంలో నల్లచెరువు గట్టు వద్ద బుధవారం ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మైలపల్లి రాము, నీలవేణి దంపతుల కుమారుడు రాజు మృతి చెందాడు. రాము ఉపాధి నిమిత్తం గుజరాత్‌లో నివాసం ఉంటుండగా.. దివ్యాంగురాలైన నీలవేణి తన ఇద్దరు కుమారులతో బడివానిపేటలో ఉంటోంది. పెద్ద కుమారుడు రాజు కొంగరాజు పంచాయతీలోనిఓ ప్రైవేటు స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. రోజులాగానే బుధవారం ఉదయం ప్రైవేటు బస్సులో స్కూల్‌కు వెళ్తుండగా... ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బోల్తా పడిన సమయంలో బస్సులో రాజుతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. బస్సు ఒరిగిన వైపు రాజు ఉండగా.. మిగిలిన వైపు ఐదుగురు కూర్చొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఎచ్చెర్ల ఎస్‌ఐ కె.రాము, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో మునిగిన బస్సును క్రేన్‌తో బయటకు తీయించారు. బడివానిపేట నుంచి కొయ్యాం మీదుగా ఉన్న ప్రధాన రహదారిని కాదని, అడ్డదారిలో వేగంగా స్కూలుకు చేరుకోవాలన్న ఆతృత వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 


చివరి చూపునకు నోచుకోని తండ్రి

రాజు చనిపోయాడన్న వార్త కూడా తండ్రి రాముకు సకాలంలో చేరలేదు. గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన రాము ఫోన్‌ సిగ్నల్‌ అందనంత దూరంలో ఉండడంతో కుమారుని మృతి సమాచారం అందలేదు. దీంతో తండ్రి లేకుండానే రాజు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. చివరి చూపునకు కూడా తండ్రి నోచుకోని ఈ సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. జిల్లా పర్యటనకు వచ్చిన విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ అమిత్‌ బర్దర్‌ పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


  

Updated Date - 2021-10-21T05:23:43+05:30 IST