సచివాలయాలెందుకు?

ABN , First Publish Date - 2021-01-12T06:10:04+05:30 IST

‘సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేద’ంటూ రావివలస గ్రామస్థులు సోమవారం ఆందోళనకు దిగారు.

సచివాలయాలెందుకు?
సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్న రావివలస గ్రామస్థులు




సిబ్బందిని నిలదీసిన రావివలస గ్రామస్థులు

కార్యాలయానికి తాళం వేసేందుకు యత్నం

 టెక్కలి రూరల్‌, జనవరి 11: ‘సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేద’ంటూ రావివలస గ్రామస్థులు సోమవారం ఆందోళనకు దిగారు. అమ్మ ఒడి పథకం వర్తింపజేయకపోవడంపై మహిళలు సచివాలయ సిబ్బందిని నిలదీశారు. సమస్యలు పరిష్కరించని సచివాలయాలు ఎందుకంటూ కార్యాలయానికి తాళం వేసే ప్రయత్నం చేశారు. పంచాయతీ కార్యదర్శి కె.వినోద్‌కుమార్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ పి.బాబూరావును నిలదీశారు. దాసరి రమణమ్మ, మాట్లాడుతూ సెంటు భూమిలేని తమకు ఏడు ఎకరాలు ఉన్నట్టు చూపించడంతో రేషన్‌కార్డు నిలిచిపోయిందన్నారు. పిల్లలకు అమ్మ ఒడి సైతం అందకుండా పోయిందని వాపోయారు. అర్హత ఉన్నా తమ పిల్లలకు అమ్మ ఒడి వర్తించలేదని అప్పిని సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఒడి అయినా ఇప్పించండి...లేకుంటే ఉన్నట్టు చూపిన భూమినైనా ఇప్పించండి అంటూ కోరడంతో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులు మౌనం దాల్చారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కూన వినోద్‌కుమార్‌, వీఆర్వో పి.నగేష్‌లను వివరణ కోరగా సాంకేతిక సమస్యలతోనే సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు.




Updated Date - 2021-01-12T06:10:04+05:30 IST