మూడునెలలుగా అందని రేషన్‌

ABN , First Publish Date - 2021-10-29T05:06:43+05:30 IST

మూడునెలలుగా అందని రేషన్‌

మూడునెలలుగా అందని రేషన్‌
పొందూరు : బాధితులతో మాట్లాడుతున్న రవికుమార్‌

- అల్మాజీపేటలో లబ్ధిదారుల ఆందోళన

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : కూన రవికుమార్‌

పొందూరు, అక్టోబరు 28 : పెనుబర్తి పంచాయతీ అల్మాజీపేట గ్రామంలో మూడు నెలలుగా కేంద్రం సరఫరా చేస్తున్న ఫ్రీ రేషన్‌ అందడం లేదు. దీంతో రేషన్‌ కార్డుదారులు గురువారం నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి కూన రవికుమార్‌ గ్రామానికి చేరుకుని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో 48 కార్డుదారులకు పీడీఎస్‌ బియ్యం అందలేదు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కేంద్రం అందించే ఉచిత బియ్యం గ్రామంలో ఎవరికీ అందలేదు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం బాధితులు వివరించారు. దీంతో సీఎస్‌డీటీ షరీఫ్‌కు ఫోన్‌ చేయడంతో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు రవికుమార్‌ తెలిపారు.

 

1.80 కింటాళ్ల బియ్యం పట్టివేత

మజ్జిలపేట గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఎస్‌డీటీ షరీఫ్‌ తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఓ దుకాణంపై దాడిచేసి 1.80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకుని కేసు నమోదు చేసినట్టు చెప్పారు.


గిరిజనులకు రేషన్‌ కష్టాలు

భామిని : గిరిజనులకు ప్రతి నెలా రేషన్‌ కష్టాలు తప్పడం లేదు. కొండలపై నుంచి  కిలోమీటర్ల మేర నడిచి మైదానం ప్రాంతానికి వచ్చినా రేషన్‌ తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇందుకు ఈ ఫొటోయే నిదర్శనం. గురువారం వారపు సంత కావడంతో కోటకొండ, బడ్రసింగి, కడంబసింగి, బూర్జిగూడ తదితర గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు భామిని జీసీసీ వద్ద ఇలా క్యూ కట్టారు. దీనిపై జీసీసీ సేల్స్‌మేన్‌ ప్రశ్నించగా నెట్‌వర్క్‌ సిగ్నిల్స్‌ సరిగా లేకపోవడంతో సకాలంలో బియ్యం ఇవ్వలేకపోతుట్టు తెలిపారు. రేగిడి గ్రామస్థులు ఇంటింటా బియ్యం సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-10-29T05:06:43+05:30 IST