ఆస్తి వివాదాలే టార్గెట్‌!

ABN , First Publish Date - 2021-06-23T05:28:13+05:30 IST

ఆమదాలవలసలో రౌడీమూకలు ప్రవేశించాయా? ఆస్తి తగదాలు, కుటుంబాల మధ్య వివాదాల్లో తల దూర్చుతున్నాయా? విధ్వంసానికి తెరతీస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలు వీటిని తేటతెల్లం చేస్తున్నాయి. పార్వతీశంపేటలో సమీప బంధువుల మధ్య ఆస్తి వివాదం కొట్లాటకు దారితీసింది.

ఆస్తి వివాదాలే టార్గెట్‌!
రౌడీమూకల దాడుల్లో ధ్వంసమైన కార్లు (ఫైల్‌)
ఆమదాలవలసలో వెలుగుచూస్తున్న నేర సంస్కృతి

దాడులకు తెగబడుతున్న వైనం

ఆందోళన చెందుతున్న జనం

(ఆమదాలవలస)

ఆమదాలవలసలో రౌడీమూకలు ప్రవేశించాయా? ఆస్తి తగదాలు, కుటుంబాల మధ్య వివాదాల్లో తల దూర్చుతున్నాయా? విధ్వంసానికి తెరతీస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలు వీటిని తేటతెల్లం చేస్తున్నాయి. పార్వతీశంపేటలో సమీప బంధువుల మధ్య ఆస్తి వివాదం కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు  ఫిర్యాదులు అందాయి. విచారణలో భాగంగా సీసీ పుటేజ్‌లో దృశ్యాలు నివ్వెరపరిచాయి. కర్రలు, రాడ్లు, పదునైన ఆయుధాలు, పెట్రోల్‌ దాడులు వెలుగు చూశాయి. పోలీసులే ఆశ్చర్యపడేలా అక్కడ విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతతకు నెలవుగా ఉన్న ఆమదాలవలసలో ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఆస్తి వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు తలదూర్చడంతో మరింత జఠిలమవుతున్నాయి. ఆ వివాదానికి సంబంధం లేకపోయినా ఒక వర్గంతో ఒప్పందం చేసుకొని ఎదుటి పక్షం వారిని నయానో..భయానో దారికి తెచ్చుకుంటున్నారు. లేకుంటే దాడులకు దిగుతున్నారు. పార్వతీశంపేట ఘటనకు సంబంధించి జరిగింది ఇదే. పిడుగు మోహనరావు, నాగం చిన్నారావులు సమీప బంధువులు. వారి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13న తన మేనల్లుడు రేరాజును చిన్నారావు కొట్టి గాయపరచినట్టు మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏం జరిగిందో కానీ మోహనరావు ఇంటిపై రౌడీ మూక దాడిచేసింది. పెట్రోల్‌ విసిరి, కర్రలు. రాడ్లతో వారు విధ్వంసం సృష్టించారు. ఇంటి ఆవరణలో ఉన్న కార్లను ధ్వంసం చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపామని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్రోల్‌ విసరడంతో ఇంట్లో కొద్దిపాటి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 20 మంది పాల్గొన్నట్టు బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం 14 మందినే అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ, ఇతరత్రా ఒత్తిడిలకు తలొగ్గకుండా విధ్వంసాలకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా.. కేసులో నిందుతులను కొంత మందిని అరెస్టు చేశామని మరి కొంతమంది పరారీలో ఉన్నారని చెప్పారు. పట్టణంలో రౌడీయిజాన్ని అణచివేస్తామన్నారు.
Updated Date - 2021-06-23T05:28:13+05:30 IST