ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందా!

ABN , First Publish Date - 2021-08-25T05:48:19+05:30 IST

జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల దందా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు గ్రామీణ, పట్టణ, నగర సర్వీసులు నడుపుతున్నారు. రవాణా, ప్రజా రవాణా (ఆర్టీసీ), పోలీస్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం తో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణాల్లోకి ప్రవేశించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందా!
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ప్రైవేటు బస్సుల తాకిడి




  (గుజరాతీపేట)

జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల దందా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు గ్రామీణ, పట్టణ, నగర సర్వీసులు నడుపుతున్నారు. రవాణా, ప్రజా రవాణా (ఆర్టీసీ), పోలీస్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం తో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణాల్లోకి ప్రవేశించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. వాస్తవానికి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోకి ప్రైవేటు వాహనాల ప్రవేశం నిషిద్ధం. కానీ జిల్లాలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లాలో శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, టెక్కలి, పలాసలో ఆర్టీసీ డిపోలున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుంటారు. అయితే ఇటీవల ప్రైవేటు బస్సులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మారుమూల మండలాల నుంచి సైతం విశాఖ, రాజమండ్రి, విజయవాడ నగరాలకు ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. వాటికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా అన్నది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. జనాల అవసరాలను ప్రైవేటు ట్రావెల్స్‌ వారు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పండుగలు, పర్వదినాల్లో రెట్టింపు ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. వారికి రాజకీయ అండదండలు ఉండడం వల్లే అటువైపు చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. 

కాంప్లెక్స్‌ ఎదుటే నిలిపివేత

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వాహన రాకపోకలు అధికం. అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో ట్రాఫిక్‌ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోఉదయం నుంచి సాయంత్రం వరకూ బయట రహదారిపై ప్రైవేటు బస్సుల తాకిడి అధికంగా ఉంటుంది. గంటల తరబడి రోడ్డుపై నిలిపివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆటోలు, టాక్సీలు కొద్ది నిమిషాల పాటు నిలిపితే హడావుడి చేసే ట్రాఫిక్‌ పోలీసులు అటువైపుగా దృష్టిపెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇకనైనా ప్రైవేటు బస్సులను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

దృష్టిసారించాం

  ప్రైవేటు బస్సుల సిబ్బందిపై దృష్టిపెట్టాం. వారు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అడుగు పెట్టకుండా నిఘా పెంచాం. ఇందుకుగాను ప్రత్యేకంగా సిబ్బం దిని నియమించాం. ఇప్పటికే పోలీస్‌ ఉన్నతాధి కారులకు సైతం ఫిర్యాదుచేశాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం

 ప్రవీణ, మేనేజర్‌, శ్రీకాకుళం 1వ డిపో





Updated Date - 2021-08-25T05:48:19+05:30 IST