అందరికీ టీకా

ABN , First Publish Date - 2022-01-01T04:54:52+05:30 IST

అందరికీ టీకా

అందరికీ టీకా

- ఒమైక్రాన్‌ విస్తరించకుండా ముందస్తు చర్యలు

- నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండగా.. మరోవైపు ఒమైక్రాన్‌ భయం జిల్లావాసులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.  అందరికీ టీకా లక్ష్యంగా పని చేస్తున్నారు. జిల్లాలో 5 నుంచి 18 ఏళ్లలోపు ఉన్నవారికి ఈ నెల 3 నుంచి ఐదు రోజులపాటు  కోవాగ్జిన్‌ టీకా వేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 10 నుంచి  ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మూడు రోజుల పాటు బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు. ఆ తరువాత 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసు ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. మరోవైపు విదేశాల నుంచి ఇటీవల జిల్లాకు వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు. వారికి ఒమైక్రాన్‌ పరీక్షలు చేస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా కొందరిలో ఒమైక్రాన్‌ లక్షణాలు బయటపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్వీయరక్షణ చర్యలు పాటించాలని.. లేదంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. విధిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు. 


వేడుకలపై ఆంక్షలు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకల పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడళ్లు, హోటళ్లలో గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో డిసెంబరు 31 అర్ధరాత్రి యువకులు రహదారులు, బహిరంగ ప్రదేశాలలో కేక్‌లు కట్‌ చేయకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత ప్రజలెవ్వరూ బయట తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో న్యూ ఇయర్‌ వేడుకల సందడి తగ్గింది. 


‘పది’ విద్యార్థులకు..

గుజరాతీపేట: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.  తల్లిదండ్రుల పరిశీలనలో విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత హెచ్‌ఎంలను డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2022-01-01T04:54:52+05:30 IST