వచ్చే ఏడాది జూన్ నాటికి వంశ‘ధార’
ABN , First Publish Date - 2021-07-25T04:46:03+05:30 IST
వచ్చే ఏడాది జూన్ నాటికి వంశ‘ధార’

క్వాలిటీ కంట్రోల్ ఈఎన్‌సీ సతీష్‌కుమార్
హిరమండలం, జూలై 24 : వచ్చే ఏడాది జూన్ నాటికి వంశధార ఫేజ్-2 రిజర్వాయర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని క్వాలిటీ కంట్రోల్ ఈఎన్‌సీ సతీష్‌కుమార్ వెల్లడించారు. శనివారం గొట్టా బ్యారేజీతో పాటు వంశధార ఫేజ్-2 రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కీలక నిర్మాణ పనులపై ఆరాతీశారు. ఎప్పటికప్పుడు నాణ్యతా పరీక్షలు చేయాలని ఆదేశించారు. లోపాలు ఉంటే వెనువెంటనే సరిదిద్దాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో సతీష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో సిబ్బంది కొరత ఉందని.. ఖాళీలను భరీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. వంశధార ఫేజ్-2 రిజర్వాయర్‌లో 8 టీఎంసీల నీరు నిల్వకు వీలుందని తెలిపారు. వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆధునికీకరణకు రూ.750 కోట్లతో ప్రతిపాదనలు పంపామని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ సుగుణాకరరావు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా పడితే రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ పోలేశ్వరరావు, ఈఈలు సుశీల్‌కుమార్, ఎంవీ రమణ, పి.అప్పలనాయుడు, డీఈలు బ్రహ్మానందం, అనీల్‌కుమార్, సోమాకంపెనీ ప్రతినిధులు సుధాకరరావు, శ్రీనివాసరావు ఉన్నారు.