పరిషత్ పోరు.. మళ్లీ మొదటికి!
ABN , First Publish Date - 2021-05-22T03:58:31+05:30 IST
పరిషత్ ఎన్నికల ప్రక్రియ విషయంలో ఆది నుంచీ గందరగోళం నెలకొంది. గత ఏడాదిగా ఎన్నికలు ప్రహసనంలా మారాయి. వివాదాలు చుట్టుముట్టాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందనగా.. గత ఏడాది కరోనాతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న తిరిగి నోటిఫికేషన్ వెలువడింది.

- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు
- గతంలో ఆగిన చోట నుంచే ప్రక్రియ
- నాలుగు వారాల గడువు ఇచ్చి నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
- డీలా పడుతున్న అభ్యర్థులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
పోలింగ్ పూర్తయి.. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న వేళ.. పరిషత్ పోరు మళ్లీ మొదటికొచ్చింది. గతంలో విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. అంతకుముందు ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నిలకు నాలుగు వారాల పాటు గడువు ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో అభ్యర్థులు, ముఖ్యంగా గెలుపుపై నమ్మకమున్నవారు డీలా పడుతున్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు చేయలేమని ఆందోళన చెందుతున్నారు.
పరిషత్ ఎన్నికల ప్రక్రియ విషయంలో ఆది నుంచీ గందరగోళం నెలకొంది. గత ఏడాదిగా ఎన్నికలు ప్రహసనంలా మారాయి. వివాదాలు చుట్టుముట్టాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందనగా.. గత ఏడాది కరోనాతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న తిరిగి నోటిఫికేషన్ వెలువడింది. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తూ ఎలక్షన్ కమిషన్ రీ షెడ్యూల్‌ను ప్రకటించింది. అదే నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించనున్నట్టు స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. తొలుత సింగిల్ బెంచ్ ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది. డివిజనల్ బెంచ్ మాత్రం ఎన్నికలకు అనుమతించింది. ఫలితాలను రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఫలితాల వెల్లడిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ.. ఎన్నికల నిర్వహణకు ముందు నాలుగు వారాల పాడు గడువు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. గతంలో ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తూ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే ఏకగ్రీవమైన స్థానాలకు డోకా లేకపోయినా మళ్లీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన ప్రారంభమైంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు గత నెల 8న ఎన్నికలు నిర్వహించారు. 37 జడ్పీటీసీ స్థానాలకు 133 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థులు 37 స్థానాల్లో, టీడీపీ అభ్యర్థులు 36 స్థానాల్లో, 21 స్థానాల్లో బీజేపీ, 16 స్థానాల్లో జనసేన, 15 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు 5 స్థానాల్లో పోటీ చేశారు. ఎంపీటీసీలకు సంబంధించి 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 590 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 1,467 మంది పోటీపడ్డారు. 2,288 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 19,01,851 మంది కాగా, 11,17,476 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 58.37 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. కొంతమంది టీడీపీ అభ్యర్థులు బరిలో కొనసాగినా.. పోలింగ్‌పై పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో తమకు ఇక పోటీ లేదంటూ.. వైసీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా హైకోర్టు తీర్పుతో అభ్యర్థుల్లో అలజడి రేగుతోంది. కోర్టు తీర్పు మేరకు 2020లో ఎక్కడి నుంచి పరిషత్ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో.. అక్కడి నుంచే మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ రానుంది. ఆపై నాలుగు వారాల వ్యవధిలో పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ అలముకుంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న పని. అటువంటిది ఏడాదిగా ఎన్నికల ప్రక్రియ కొనసాగిందంటే అభ్యర్థుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేవలం కౌంటింగ్ ముంగిట ప్రక్రియ నిలిచిపోవడంతో గెలుపుపై ధీమా ఉన్న అభ్యర్థులు డీలా పడిపోయారు. ఇప్పటికే ఎన్నికలకు భారీగా ఖర్చు చేశామని... మళ్లీ మొదటికే వస్తే మరోసారి ఖర్చు భరించే స్థితిలో లేమని కొందరు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం డివిజనల్ బెంచ్‌కు వెళ్లే అవకాశముందని తెలుస్తుండడంతో కొందరు ఆశ వదులుకోలేదు. శుక్రవారం ఉదయానికే కోర్టు తీర్పు రావడంతో అంతటా ఇదే చర్చనీయాంశమైంది.