ఎదురెదురుగా ఇళ్లు.. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య Love.. పెద్దల నుంచి అభ్యంతరం.. సెప్టెంబరులో ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి.. కొద్దిరోజులకే పెను విషాదం.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2021-10-28T19:31:45+05:30 IST

ఆ యువతీ యువకులవి ఎదురెదురు ఇళ్లే. ఒకే సామాజికవర్గం. ఒకరినొకరు ఇష్టపడ్డారు....

ఎదురెదురుగా ఇళ్లు.. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య Love.. పెద్దల నుంచి అభ్యంతరం.. సెప్టెంబరులో ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి.. కొద్దిరోజులకే పెను విషాదం.. అసలేం జరిగింది..!?

శ్రీకాకుళం జిల్లా/రేగిడి : ఆ యువతీ యువకులవి ఎదురెదురు ఇళ్లే. ఒకే సామాజికవర్గం. ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇరు కు టుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్నేహితుల సమక్షంలో అన్నవరం సత్యదేవుని సన్నిధి లో ఒక్కటయ్యా రు. రెండు నెలలుగా విశాఖలో ఉండి బుధ వారం స్వగ్రామా నికి వచ్చారు. వచ్చిన గంటన్నర వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేగిడి మండలం తునివాడలో ప్రేమికుల విషా దాంతమిది.  పాలకొండ సీఐ శంకరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. తునివాడకు చెందిన పల్లె హరీష్‌ (29), దివ్య (21) అనే దంపతులు బుధవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఊరేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.


పల్లె చిన్నంనాయుడు, వసంతలకు నలుగురు సంతానం కాగా.. హరీష్‌ రెండో కుమారుడు, ఎంసీఏ చదువుకొని విశాఖలో ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. వీరి ఎదురింటిలో రుంకు శ్రీనివాసరావు, మంజుల దంపతులు కుటుంబం నివాసముంటున్నారు. వీరి కుమార్తె దివ్య విజయనగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. గత కొన్నేళ్లుగా హరీష్‌, దివ్యలు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకూ తెలియడంతో వారు అభ్యంతరం  చెప్పారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు-01న అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.


ఆ తరువాత విశాఖలో కాపురం పెట్టారు. అయితే బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారు స్వగ్రామం తునివాడకు వచ్చారు. ఇద్దరూ హరీష్‌ ఇంటికి చేరుకున్నారు. అక్కడికి గంటన్నర తరువాత వారు మేడపైకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మేడపైకి వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఘటన జరుగగా 4 గంటల తరువాత పోలీసులకు సమాచారమందింది. సీఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ అలీలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాలతో మాట్లాడారు. అన్ని వివరాలు ఆరాతీశారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ను రప్పించారు.


అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అనంతరం ఆత్మహత్యగా నిర్థారించారు. ఇరు కుటుంబాల ఆదరణ లేక మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు పెద్దఎత్తున చేరుకొని మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతదేహాలకు శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శంకరరావు తెలిపారు.

Updated Date - 2021-10-28T19:31:45+05:30 IST